ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సుడ్ సర్వీసెస్(ఆప్కాస్) ద్వారా వారికి ప్రయోజనం చేకూర్చనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆప్కాస్ ను ప్రారంభించి ఉద్యోగులతో చర్చలు జరపనున్నారు. ఆప్కాస్ పేరుతో ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా 47,000 మంది ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లను జారీ చేయనున్నారు. 
 
ఆప్కాస్ ద్వారా స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ను గుర్తించి వివిధ శాఖలు, సంస్థల అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఉద్యోగులకు ఈ.పీ.ఎఫ్, ఈ.ఎస్.ఐలాంటి ప్రయోజనాలను సైతం కల్పించనుంది. ఆప్కాస్ ద్వారా ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, కేటరింగ్ వాహనాల అద్దె లాంటి వాటి కోసం అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను ప్రభుత్వం అందించనుంది. 
 
ఆప్కాస్ వన్ స్టాప్ - షాప్ గా రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్యాలయాల్లో జరిగే ప్రక్రియ గురించి పని చేస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్ పరిధిలోకి మార్చింది. ఏపీలో ఆప్కాస్ మాత్రమే ఉద్యోగులకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఏజెన్సీగా పని చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆప్కాస్ ఏ మాత్రం లాభాపేక్ష లేకుండా పని చేస్తుంది. 
 
ఆప్కాస్ లో రిజర్వేషన్ ప్రక్రియ పక్కాగా అమలవుతోంది. ప్రస్తుతం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ యథాతథంగా కొనసాగుతారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీ బదిలీ ప్రక్రియను సమీక్షిస్తుంది. ఈ కమిటీ అవసరమైతే కొత్త అభ్యర్థులను కూడా సూచిస్తుంది. ఆప్కాస్ లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలు... మైనారిటీలకు 29 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. ఆప్కాస్ ఏర్పాటు ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో లంచాలు, కమిషన్లకు తావుండదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: