దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అన్ లాక్ 2.0 లో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇతర రంగాలతో పోలిస్తే కరోనా మహమ్మారి విజృంభణ విద్యారంగంపై తీవ్రంగా పడింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం పరీక్షలు రద్దయ్యాయి. సాధారణంగా జూన్ 12వ తేదీన పాఠశాలలు తెరచుకోవాల్సి ఉన్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు తెరచుకుంటాయో ఎవరూ చెప్పలేరు. 
 
పోటీ పరీక్షల విషయంలో సైతం గందరగోళం నెలకొంది. దీంతో 2020 - 21 విద్యాసంవత్సరం ఉంటుందా? అనే ప్రశ్న వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా జులై ఒకటో తేదీ నుంచి రెండో విడత అన్ లాక్ అమలవుతోంది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించటం సాధ్యమవుతుంది. ఏదో ఒక అద్భుతం జరిగితే మాత్రమే పరిస్థితులు మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. 
 
ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనటం కష్టమేనని వార్తలు వినిపిస్తున్నాయి. యూజీసీ సిలబస్‌ను 50 శాతం తగ్గించి... తరగతులను, పనిదినాలను కుదించి విద్యాసంస్థలను నిర్వహించాలని ప్రతిపాదనలు చేస్తున్నా ఆచరణలో సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది తల్లిదండ్రులు విద్యాసంస్థలు తెరిచినా పిల్లలను పంపించేందుకు సుముఖంగా లేరు. 
 
1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా క్లాసులు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నా ఈ తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమంటూ పలు జిల్లాల డీఈవోలు సర్క్యులర్లు జారీ చేశారు. ప్రైవేటు పాఠశాలలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నా పేద కుటుంబాల పిల్లలు ఎక్కువగా ఉండే ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో ఈ విధానం అమలు ఎంతవరకూ సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: