ముంబై లాల్ బాగ్ గణేష్ ఉత్సవాలపై కరోనా ప్రభావం పడింది. ఎంతో ఫేమస్ అయిన గణేష్ ఉత్సవాలకు ఈసారి ముంబై వాసులు దూరం కానున్నారు. వైరస్‌ ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది లాల్‌బాగ్ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు  నిర్వాహకులు ప్రకటించారు. 87 ఏళ్ల చరిత్రలో ఉత్సవాలను రద్దు చేయడం ఇదే తొలిసారి.  

 

దేశంలో గణేష్ ఉత్సవాలకు పెట్టింది పేరు ముంబై. ఇక లాల్ బాగ్ గణేష్ ఉత్సవాలంటే .. హైదరాబాద్ వాసులకు ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్సో.. ముంబై వాసులకు లాల్‌బాగ్ రాజా గణపతీ అంతే. ముంబైలోని లాల్‌బాగ్‌ వద్ద ఏటా గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్దఎత్తున హాజరవుతుంటారు.  

 

అయితే ఈ సారి కరోనా  వైరస్‌ ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది లాల్‌బాగ్ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు లాల్‌బాగ్ గణేశ్ మండలి ప్రకటించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున,  ఈ ఏడాది విగ్రహాన్ని ప్రతిష్టించడం లేదని తెలిపారు. 87 ఏళ్ల చరిత్రలో ఉత్సవాలను రద్దు చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ ఏడాది పండగ సమయంలో రక్తదాన, ప్లాస్మా థెరపీ శిబిరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు నిర్వాహకులు. 

 

కరోనా మహమ్మారి మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న తరుణంలో వివిధ మత వర్గాలకు చెందిన ప్రజలు నిగ్రహాన్ని పాటించడంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ..ఈ సంక్షోభానికి ఇంకా అడ్డుకట్టపడలేదన్నారు. ప్రజలు నిబంధనలను కచ్చితంగా పాటించాలని అభ్యర్థించారు. 

 

మరోవైపు లక్షలు ఖర్చుపెట్టి గణేశ్‌ విగ్రహస్థాపనలు చేసే బదులు.. సేవా కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పిలుపునిచ్చారు. ముంబైలో భారీ గణేశ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీ.. ఈసారి నవరాత్రి వేడుకలకు బదులుగా.. 25 లక్షల రూపాయలను కరోనా నివారణ కార్యక్రమాలకు అందజేస్తోందన్నారు. అదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీలన్నీ ముందుకు రావాలన్నారు. హైదరాబాద్‌లోని ఉత్సవ కమిటీలన్నీ.. నవరాత్రి వేడుకల ఖర్చును సేవా కార్యక్రమాలకు వినియోగించాలని రాజాసింగ్‌ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: