అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండిత‌నం గురించి, తిక్క కామెంట్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పే అమెరికా అధ్య‌క్షుడు ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌కు కార‌ణ‌మైన చైనాపై మ‌ళ్లీ మండిప‌డ్డారు. వైట్‌హౌస్‌లో జ‌రిగిన స్పిరిట్ ఆఫ్ అమెరికా షోకేష్‌ అనే కార్య‌క్ర‌మంలో డొనాల్డ్ ట్రంప్ తాజాగా మ‌రోసారి విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పించారు. చైనా నుంచి ఈ ప్లేగు వ్యాధి వ‌చ్చి ఉండాల్సింది కాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

 


గ‌‌త ఏడాది ఆఖ‌రులో వుహాన్‌లోని సీఫుడ్ మార్కెట్లో పుట్టుకొచ్చిన క‌రోనా ప్ర‌పంచ దేశాల‌ను చుట్టుముట్టి 5.20 ల‌క్ష‌ల మందికిపైగా చావుల‌కు కార‌ణ‌మైంది. ఇక అమెరికాలో 27.39 ల‌క్ష‌ల మంది క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. 1.28 ల‌క్ష‌ల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇప్ప‌టికే ఈ వైర‌స్‌కు వుహాన్ వైర‌స్ అని ట్రంప్ పేరు పెట్టేశారు. తాజాగా ఆయ‌న మ‌ళ్లీ స్పందిస్తూ కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిన ఒక‌ ప్లేగు వ్యాధి అని వ్యాఖ్యానించారు. చైనా ఈ మ‌హ‌మ్మారిని విస్త‌రింప‌జేయ‌కుండా ఉండాల్సిందని, కానీ విస్తరింప‌జేసింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. చైనాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బ్రాండ్-న్యూ ట్రేడ్ ఒప్పందం చేసుకుంద‌ని, ఆ ఒప్పందంపై చేసిన సంత‌కంలో సిరా ఆర‌క‌ముందే క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రించింద‌ని ట్రంప్ విమ‌ర్శించారు.

 


ఇదిలాఉండ‌గా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు నిర్వ‌హించే ప్ర‌చారంలో కీల‌క విష‌యం వెల్ల‌డించారు. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో అమెరికాలో ఎన్నిక‌ల ప్ర‌చారంపై భయాందోళనలు నెలకొన్నాయి.  ఎన్నికల ర్యాలీలు మొదలయితే.. రెండో దఫా వైరస్‌ కేసుల విజృంభణ కొనసాగే ప్రమాదం ఉందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల ప్రచారం సాగించేందుకు ఉత్సహాంగా ఉన్న ట్రంప్‌.. తమ పార్టీ మద్దతుదారులకు మాత్రం ఓ క్లారిటీ ఇచ్చారు.  సభకు హాజరు కావాలనుకుంటున్న వారి నుంచి ఆయన ఓ హామీ పత్రాన్ని తీసుకోనున్నారు. ఒకవేళ ఎన్నికల ర్యాలీలకు ఎవరు హాజరైనా.. వారు తమ ప్రభుత్వాన్ని వైరస్‌ విషయంలో నిలదీయరాదు అని ఓ ఆంక్షను విధించారు. సభలకు హాజరుకావడం వల్లే తమకు వైరస్‌ సంక్రమించిందని దేశాధ్యక్షుడిని కానీ, సభ నిర్వాహకులను కానీ ..కోర్టుకు ఈడ్చరాదంటూ జనం నుంచి హామీ పత్రంపై సంతకం తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: