తెలంగాణలో కరోనా ఉధృతి దారుణంగా పెరుగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఒకప్పుడు రోజూ పదుల్లో కేసులు వచ్చేవి.. ఆ తర్వాత ఆ సంఖ్య వందలకు చేరింది.. ఇప్పుడు ఏకంగా వేలల్లో కేసులు వస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 1,892 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.

 

 

అంతేకాదు.. గత మూడు రోజులుగా వరుసగా ఇదే సీన్.. రోజూ వెయ్యికి పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే హోంమంత్రికి కరోనా వచ్చింది. మరో నలుగురు ఎమ్మెల్యేలకూ కరోనా వచ్చింది. ఇక హైదరాబాద్ సంగతి చెప్పనక్కర్లేదు. మొత్తం కేసుల్లో ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచే వస్తున్నాయి.

 

 

ఈ నేపథ్యంలో కరోనా కట్టడి విషయంలో గతంలో చూపించినంత శ్రద్ధ చూపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కేసీఆర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దీన్ని అరికట్టేందుకు ప్రత్యేక ఐఏఎస్‌ల బృందాన్ని రంగంలోకి దించారు. ఇక ఈ బృందం రోజూ కరోనా పరిస్థితిని సమీక్షించి .. క‌ట్టడి చర్యలను పర్యవేక్షిస్తుంది.

 

 

తెలంగాణలో కరోనా వచ్చిన మొదట్లో కేసీఆర్ దీన్ని అరికట్టే బాధ్యత ఐఏఎస్‌ అధికారులకే ఇచ్చారు. ఆ తర్వాత క్రమంగా వారు తమ శాఖల పనుల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు సీన్ చేయిదాటే పరిస్థితి కనిపించడంతో మరోసారి కేసీఆర్ ఐఏఎస్ ల సేవలు వినియోగించదలచుకున్నారు. ఈసారి ఏకంగా ఐఏఎస్‌లతో ఓ జట్టు ఏర్పాటు చేసి.. దానికి కట్టడి బాధ్యతలు అప్పగించారు. మరి ఈ టీమ్ ఏమేరకు తెలంగాణలో కరోనాను కట్టడి చేస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: