ఆ పత్రికకు ఘన చరిత్ర ఉంది. సత్యమే తమ పునాది అంటారు. నీతులు చెబుతారు. కానీ.. వాటిని వారే పాటించకపోవడం ఇప్పుడు కళ్లకు కడుతోంది. టాప్ తెలుగు దిన పత్రికగా దశాబ్దాల తరబడి రికార్డులు సృష్టిస్తున్న ఆ పత్రిక ఇప్పుడు కరోనా కాలంలో సొంత జర్నలిస్టుల ప్రాణాలనే పణంగా పెడుతోంది. కరోనా గురించి రోజూ పేజీలకు పేజీలు వార్తలు రాసే ఆ పత్రిక ఇప్పుడు సొంత జర్నలిస్టుల గురించి లేశ మాత్రమైనా ఆలోచించడం లేదు.

 

 

కరోనా ఎలా వస్తుంది.. కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా ప్రభావం ప్రపంచంపై ఎలా ఉంది..ఎక్కడ ఎన్ని కరోనా కేసులు వచ్చాయి.. ఇలాంటి సమాచారం రోజూ అందించే ఆ టాప్ తెలుగు పత్రిక తన పత్రికలో పని చేసే జర్నలిస్టుల ప్రాణాల గురించి మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ పత్రిక కార్యాలయాల్లో చాలా కరోనా కేసులు నమోదయ్యాయి.

 

 

సాధారణంగా అలా కరోనా కేసులు వస్తే.. ఇంటి వద్ద నుంచి పని చేసే అవకాశాలు పరిశీలించాలి. దిన పత్రికలు చాలా ఇప్పుడు అదే పని చేస్తున్నాయి కూడా. నిత్యం నీతి సూత్రాలు వల్లించే ఆ పత్రిక యాజమాన్యం మాత్రం ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఆ పత్రికలోని అనేక విభాగాల్లోని జర్నలిస్టులకు కరోనా సోకింది. అయినా మిగిలిన ఉద్యోగులకు కరోనా వ్యాపించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించడం లేదు.

 

 

విచిత్రం ఏంటంటే.. ఇలాంటి పరిస్థితి వేరే ఇంకా ఏ కార్యాలయంలో ఉన్నా.. ఆ పత్రిక చీల్చి చెండాడేది.. ప్రాణాలను పణంగా పెట్టి పని చేయిస్తారా... అంటూ పేజీలకు పేజీలు వార్తలు రాసేదే.. కానీ జరిగింది తమ పత్రిక కార్యాలయం కాబట్టి లైట్ గా తీసుకుంటున్నారు. నీతులు ఉన్నది చెప్పేందుకే అని మరోసారి రుజువు చేస్తున్నారు. మిగిలిన పత్రికలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఆ టాప్ తెలుగు దిన పత్రిక యాజమాన్యం తీరుపై జర్నలిస్టులు మండిపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: