అమరావతి ఉద్యమం 200 రోజులకు చేరడంతో, మళ్ళీ రాష్ట్రంలో రాజధానిపై రగడ మొదలైంది. సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధి కోసమని మూడు రాజధానులని ఏర్పాటు చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, జ్యూడిషయల్ క్యాపిటల్‌గా కర్నూలులని ప్రకటించారు. కానీ ప్రతిపక్ష టీడీపీ, అమరావతి ప్రాంత రైతులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మొత్తం రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు. ఇక 200 రోజుల నుంచి అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నారు.

 

ఇక 200వ రోజు సందర్భంగా టీడీపీ నేతలు అమరావతి ఉద్యమానికి మద్ధతుగా దీక్షలు చేశారు. ఈ క్రమంలోనే విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.  జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి భూముల విలువ పెంచుకోవడం కోసమే రాజధాని పేరుతో విశాఖపై వాలుతున్నారని, విజయసాయిరెడ్డి విశాఖలో తిష్టవేశాక వేల ఎకరాలు కబ్జా అయ్యాయని బండారు ఆరోపించారు.

 

ఊహించని విధంగా ఆరోగ్య సేతు యాప్‌ రూపొందించిన శైలేజ్‌ స్థలాన్ని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నించారని,  ఉత్తరాంధ్రపై ప్రేమ కాదని.. భూకబ్జాల కోసమే విశాఖలో రాజధాని ప్రకటన చేశారని మాట్లాడారు. అయితే విశాఖలో కబ్జాలు జరిగితే నిరూపించాలని జిల్లా వైసీపీ శ్రేణులు బండారుకు సవాల్ విసురుతున్నారు. కేవలం ఉత్తరాంధ్రకు రాజధాని రాకుండా అడ్డుకోవాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, ఆ కుట్రలో బండారు ఓ పాత్ర పోషిస్తున్నారని మండిపడుతున్నారు.

 

విశాఖ ఆర్ధిక రాజధాని అయితే, ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఆ అభివృద్ధికు బ్రేకులు వేయడానికే టీడీపీ నేతలు కబ్జాలంటూ మాట్లాడుతున్నారని అంటున్నారు. అసలు గత ఐదేళ్లలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బండారు, ఆయన తనయుడు చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కాదని, ఐదేళ్లలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్నారు. బండారు తనయుడు సన్యాసి నాయుడు అక్రమాలు చేయడంలో తక్కువేం కాదని…ఇసుక దోపిడి, భూ కబ్జాలకు పాల్పడ్డారని విమర్శలు గుప్పిస్తున్నారు. తనయుడు చేసిన అక్రమాలు వలనే 2019 ఎన్నికల్లో బండారు పెందుర్తిలో ఓడిపోయారని గుర్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: