చంద్రబాబు తనయుడుగా రాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్...మొదట్లో టీడీపీ బలోపేతానికి వెనుక ఉండి సలహాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో తెర వెనుక ఉండి మేనిఫెస్టోలో కొన్ని కీలక అంశాల రూపకల్పన చేశారు. అయితే 2009 ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ ఓటమి పాలై అధికారం దక్కించుకోలేకపోయింది. ఇక 2014లో రాష్ట్రం విడిపోవడంతో అనుభవం గల నేత కావాలని ఏపీ ప్రజలు చంద్రబాబుకు అధికారాన్ని అప్పగించారు.

 

కానీ చంద్రబాబు అధికారం ఉపయోగించుకుని... అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయని లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రిని చేశారు. మంత్రిగా లోకేష్ కాస్త పర్వాలేదనిపించేలా పనిచేశారు. అయితే ఆయన మాట తీరు సరిగా లేకపోవడం వల్ల పార్టీకి మైనస్ అయింది. ఇక ఆ విషయాన్ని అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ రాజకీయంగా బాగా వాడుకుంది. దీంతో 2019 ఎన్నికల్లో జగన్ గాలితో పాటు లోకేష్ ప్రభావం వల్ల టీడీపీ ఘోరంగానే ఓడిపోయింది.

 

అయితే తొలిసారి ఎన్నికల బరిలో దిగిన లోకేష్ కూడా దారుణంగా ఓడిపోయారు. రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో పోటీ చేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. ఇక ఈ ఓటమిని వైసీపీ నేతలు ఎప్పుడు ఎగతాళి చేస్తూనే ఉన్నారు. తమపై లోకేష్ ఏమన్నా విమర్శలు చేస్తే, వెంటనే ఎన్నికల్లో గెలవలేని లోకేష్ మాట్లాడటం ఏంటి అన్నట్లు  వైసీపీ నేతలు తీసిపారేస్తున్నారు. పైగా లోకేష్ ఓటమి రాజధానితో లింక్ అయింది. మూడు రాజధానులు వద్దు అమరావతి కావాలంటున్న టీడీపీకి...లోకేష్‌నే రాజధాని ప్రాంతంలో ఓడిపోయారని వైసీపీ వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. 

 

అయితే చినబాబు ఏదొకరోజు విజయం సాధించి ఎమ్మెల్యే అవుతారని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. తాము అధికారంలో ఉండగా జైలుకు వెళ్లొచ్చిన జగన్ సీఎం కాలేరని చాలాసార్లు అవహేళన చేశామని, కానీ అదే రివర్స్ అయ్యి జగన్ భారీ మెజారిటీతో గెలిచారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ఓడిపోయారని ఎగతాళి చేస్తున్నారని, కాబట్టి భవిష్యత్‌లో ఆయన గెలుపు ఖాయమని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: