ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు కృష్ణా రాజకీయాల్లో దేవినేని ఉమా ఆధిపత్యం చెలాయించారు. మొన్నటివరకు మంత్రిగా ఉన్న సమయంలో కూడా బాగానే హడావిడి చేశారు. కానీ ఎప్పుడైతే జగన్ దెబ్బకు తొలిసారి ఓటమి చవిచూశారో, అప్పటి నుంచి దేవినేని ఉమాకు చెక్ పడిపోయింది. సొంత పార్టీ వాళ్ళే ఉమాని లెక్కచేయడం లేదు. ఆయన మాట ఎవరు వినడం లేదు. ఇక అధికార పక్షం వైసీపీ వాళ్ళు అయితే కూరలో కరివేపాకులాగా తీసిపారేస్తున్నారు.

 

అయితే ఆధిపత్యం తగ్గినా సరే...ఉమా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఏదొక విధంగా తన హవా కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పెత్తనం చేసేందుకు చూస్తున్నారు. ఆ మేరకు అప్పుడప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ...తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ పెత్తనం చేసినా...విజయవాడ నగరంలో మాత్రం ఉమా పప్పులు ఉడకటం లేదు.

 

ఇక్కడ టీడీపీలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ల డామినేషన్ నడుస్తోంది. జిల్లాలో అందరూ ఓటమిపాలైన కూడా విజయవాడ ఎంపీగా నాని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గద్దె విజయం సాధించారు. దీంతో ఉమాని విజయవాడ రాజకీయాల్లోకి కాలు పెట్టనివ్వడం లేదు. అయితే విజయవాడ రాజకీయాల్లో తన పెత్తనం కొనసాగించాలని ఉమా ఏదొరకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

 

ఈ క్రమంలోనే విజయవాడ నగరంపై పూర్తి పట్టున్న కేశినేనికి చెక్ పెట్టేందుకు ఉమా తెర వెనుక ఉండి రాజకీయం చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ కార్పొరేషన్ టీడీపీ ఖాతాలో పడేలా చేయాలని కేశినేని...తన కుమార్తె శ్వేతని మేయర్ అభ్యర్ధిగా రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. దీంతో శ్వేత ఓడిపోతే కేశినేని ఆధిపత్యానికి చెక్ పడిపోతుందని చెప్పి, ఉమా, తన బంధువైన వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు పరోక్షంగా మద్ధతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో తనకు అనుకూలంగా ఉన్న కొందరు నాయకులని అవినాష్‌కు సపోర్ట్ ఇచ్చేలా చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే కేశినేనికి చెక్ పెట్టడానికి దేవినేని అష్టకష్టాలు పడుతున్నట్లు తెలుస్తోంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: