`చిన్న‌ప్పుడు టీకా అంటే...పారిపోయేవాళ్లం. ఇప్పుడు టీకా కోసం ఎదురు చూస్తున్నాం` ఇది స‌ర‌దాకు అంటున్న మాట అయిన‌ప్ప‌టికీ...కొవిడ్‌-19 టీకా కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. దీనిపై రోజుకో ప్రకటన వెలువడుతోంది. ఆగస్టు 15 వరకు ప్రపంచంలోనే తొలి టీకాను సిద్ధం చేస్తున్నట్లు ఐసీఎంఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ఏడాదిలో వ్యాక్సిన్‌ రావడం సాధ్యంకాకపోవచ్చని సీఎస్‌ఐఆర్‌ -సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ) డైరెక్టర్‌ రాకేశ్‌ కే మిశ్రా వెల్లడించారు. ఐసీఎంఆర్ ప్ర‌క‌ట‌న మరుసటిరోజే మిశ్రా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

 

 

ఐసీఎంఆర్‌ రాసిన లేఖను ఉటంకిస్తూ మిశ్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టీకా అందుబాటులోకి తెచ్చే ప్రక్రియలో చాలా క్లినికల్‌ ట్రయల్స్‌, డేటా టెస్టింగ్‌ చేయాల్సి ఉన్నందున సమయం పడుతుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో టీకా రావొచ్చని ఆయన తెలిపారు. ‘ఐసీఎంఆర్‌ ఉద్దేశం చూస్తుంటే క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేలా ఆస్ప‌త్రుల‌పై ఒత్తిడి తెచ్చేలా ఉంది. ఒక పద్ధతి ప్రకారం వెళ్తే ఈ ప్రక్రియ అంతా జరిగేందుకు ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అనారోగ్యానికి గురైన వ్యక్తికి టీకా ఇచ్చి అతడు కోలుకున్నాడా? లేదా? అని తెలుసుకోవడానికి ఇది ఒక డ్రగ్‌ కాదు.’ అని మిశ్రా వ్యాఖ్యానించారు. 

 

 

క‌రోనా వ్యాక్సిన్‌కు సంబంధించి తాము ప్రతిరోజూ 400 నుంచి 500 పరీక్షలు చేస్తున్నట్లు సీసీఎంబీ డైరెక్ట‌ర్ మిశ్రా వెల్లడించారు. అయితే, తాజాగా తాము ఐసీఎంఆర్‌కు కొత్త పరీక్షా విధానాన్ని ప్రతిపాదించినట్లు చెప్పారు. దీనిప్రకారం సురక్షితమైన మార్గంలో పరీక్షలు చేయవచ్చని, సమయం కూడా సగానికి తగ్గుతుందన్నారు. అలాగే, ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, మానవ వనరులు కూడా తక్కువగా అవసరపడతాయన్నారు. దీనిపై ఐసీఎంఆర్ సలహా కోసం వేచిచూస్తున్నట్లు మిశ్రా తెలిపారు. కాగా, మిశ్రా వ్యాఖ్య‌లు అనేక‌మందిలో ఆలోచ‌న‌లో ప‌డేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: