ఏపీ కేబినెట్ విస్తరణ తేదీ ఈ నెల 22 అని జగన్ నుంచి బయటకు లీక్ రావడంతో, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. జగన్ కు తాము బాగా కావాల్సిన వాళ్ళం అని,  తమ  తరువాత మాత్రమే ఎవరికైనా మంత్రి పదవి కట్టబెట్టబెడతారని, మొదటి విడత విస్తరణలో సామాజికవర్గాల సమీకరణల కారణంగానే, తమకు మంత్రి పదవి దక్కలేదని, కానీ ఈ సారి మాత్రం తమకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని చాలామంది జగన్ కి అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రస్తుత మంత్రి మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ పదవులకు రాజీనామా చేయబోతున్న నేపథ్యంలో, రెండు మంత్రి పదవులు ఖాళీ కాబోతున్నాయి.

IHG

 

వాటితో పాటు, ప్రస్తుత మంత్రులుగా ఉన్న కొంతమందిని తప్పించి జగన్ మరికొంత మందికి అవకాశం కల్పించే ఆలోచనలో ఉండడంతో, ఆశావాహులు పెద్ద ఎత్తున జగన్ కు దగ్గరయ్యేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ ఎవరి పేరును మంత్రులుగా తీసుకుంటామని ప్రకటించలేదు. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేయబోతున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ ఇద్దరూ బీసీ సామజిక వర్గానికి చెందిన వారు కావడంతో, ఆ సామాజిక వర్గాలకు చెందిన వారికే మంత్రి పదవులు రెండూ దక్కబోతున్నాయని, మిగతా మంత్రి పదవులు జగన్ కు వీర విధేయులైన వారికి దక్కుతాయని, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎవరికి వారు తమకే మంత్రి పదవి వరిస్తుందని ఆశలు పెట్టుకున్నారు.

 

ముఖ్యంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన విడుదల రజిని, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్ కే రోజా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తెల్లం బాలరాజు, ముదునూరి ప్రసాద్ రాజు, ఇంకా తూర్పుగోదావరి జిల్లా నుంచి పొన్నాడ సతీష్, కృష్ణా జిల్లా నుంచి కొలుసు పార్థసారథి, జోగి రమేష్ ఇలా చెప్పుకుంటూ వెళితే, చాలామంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మరి వీరిలో ఎవరి ఆశలను జగన్ నెరవేరుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: