అదేంటి మోడీతో బాబుకు చనువు ఏంటి. ఆయన్ని నానా మాటలు అన్నది ఇదే బాబు కదా. పైగా ఏపీకి రావద్దు అంటూ ఒక దేశ ప్రధానికి గో బ్యాక్ అంటూ డిమాండ్ చేసి కొత్త కల్చర్ తీసుకువచ్చిన చరిత్ర కూడా బాబుదే కదా. తీరా ప్రధాని అంతటి వారు ఏపీకి వస్తే కనీస ప్రోటోకాల్ కూడా పాటించకపోవడమే కాకుండా ఆయన వచ్చే దారి పొడవునా నల్ల కుండలతో ప్రదర్శన చేసి దారుణాతిదారుణంగా అవమాన పరచింది కూడా ఇదే బాబు కదా.

 

చూశారా మోడీతో బాబు అనగానే రెండేళ్ళ క్రితం జరిగినవి అన్నీ వరసగా ఎలా గుర్తుకువచ్చేస్తున్నాయో. మరి సాధారణ జనమే ఆ విషయాలను అంతలా గుర్తుపెట్టుకున్నపుడు అవమానం పడినవాడు, దేశానికి నాడూ నేడూ నంబర్ వన్ మొనగాడు, అత్యంత బలవంతుడు, రాజకీయంగా అపర చాణక్యుడు అయిన మోడీకి ఇవన్నీ గుర్తు ఉండకుండా పోతాయా. ఆయన అలా ప్రతీదీ మరచిపోతే ఇంత ఎత్తుకు ఎదిగేవారా.

 

ఇదంతా బాబు భ్రమ కాకపోతేనూ. బాబు తన మైండ్ నుంచి తూచ్ అని అన్నీ తుడిచేసుకోగానే ఏపీ జనం అది మరచిపోతారు, ప్రధాని మోడీ కూడా మరచిపోతారు అనుకుంటారేమో. కానీ మోడీ అలాంటి వారు కాదు, ఇక జనాలకు కూడా అన్నీ బాగా గుర్తు ఉంటాయి. మొదట చెప్పుకున్నట్లుగా ఇది అంతా బాబు గారి భ్రమ. ఉత్త భ్రమ. లేకపోతే మోడీతో బాబుకు చనువు ఎక్కడ నుంచి వస్తుంది.

 

సరే ఇవన్నీ పక్కన పెడితే తన కలల రాజధాని అమరావతిని కాపాడే బాధ్యతను మెల్లగా  చనువుగా ప్రధాని మోడీకి తగ్లించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. అమరావతి రాజధాని రైతుల పోరాటం రెండు వందల రోజులు అయిన వేళ బాబుకు మరోసారి అమరావతి పొరాటం గురించి మాట్లాడే అవకాశం వచ్చింది.

 

దాన్ని ఆయన చక్కగానే సద్వినియోగం చేసుకున్నారు. అంతే కాదు మోడీజీ ఇకపైన ఈ భారమంతా మీదే. అమరావతిని మీరే కాపాడాలి. మీదే  పూర్తి రెస్పాన్సిబిల్టీ. ఎందుకంటే అమరావతికి 2500 కోట్లు మీరు ఇచ్చారు కాబట్టి అని బాబు చెబుతున్నారు. సరే కేంద్రం వాటాగా ఆ మొత్తం ఇచ్చిందనుకున్నా బాబు కలల రాజధానికి కావాల్సింది నాలుగు లక్షల కోట్ల రూపాయలే.

 

అందులో 2,500 కోట్లు ఎంత. ఈ మూలకు అక్కరకు వస్తుంది. పనిలో పనిగా అమరావతిని 30 వేల ఎకరాల్లో అభివ్రుధ్ధి చేద్దామనుకున్నాను. అందువల్ల నా కలల రాజధానిని నాలుగు లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసి మీరే పూర్తి చేయండి స్వామీ అని అడిగితే చాలా బాగుండేదేమో. అపుడు జగన్ కూడా ఎస్ అంటూ పచ్చ జెండా ఊపేవారు కదా. ఇపుడు అమరావతి ఎందుకు భారం అయిందో బాబుకు తెలియనిది కాదు కదా. లక్షల కోట్లు పెట్టలేమనే కదా జగన్ చేతులెత్తేస్తున్నాడు. 

మరి ఇంత చనువుగా మోడీని అడుగుతున్న బాబు ఆ పనేదో కూడా పూర్తి చేస్తే అమరావతి ఉద్యమాలు ఉండవు. ఎంచక్క ప్రధాని మోడీ అమరావతి అని పేరు కూడా మార్చి పెట్టుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: