`చైనా పెట్టుబడులు రాకపోతే భారత్‌కు నిధుల కొరత వస్తుందేమోనన్న సందేహం అవ‌స‌రం లేదు. ఇంకా చెప్పాలంటే చైనా దేశం పెట్టుబడులపైనే భారత్‌ ఆధారపడట్లేదు. దేశంలోని రహదారుల ప్రాజెక్టుల్లోకి చైనా సంస్థలను రానివ్వబోము. జాయింట్‌ వెంచర్లనూ అంగీకరించేది లేదు. రోడ్లు, రహదారుల నిర్మాణంలో భారతీయ సంస్థలే పాల్గొంటాయి` అని చైనా చెంప చెల్లుమ‌నిపించేలా, బీజేపీ ముఖ్య‌నేత‌, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తేల్చిచెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థతో గ‌డ్క‌రీ మాట్లాడుతూ, ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చారు.

 


భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నడుమ దేశంలోని చైనా కంపెనీల ఆనవాళ్లను మోదీ సర్కారు చెరిపేస్తోంది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన 59 యాప్‌లపై వేటు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశీయ మౌలిక రంగంపైనా చైనా నీడ లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనిపై, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందిస్తూ, ‘ప్రస్తుత విధానాలను మార్చేస్తున్నాం. మౌలిక ప్రాజెక్టుల కోసం ఆర్థిక, సాంకేతిక అర్హతలను సడలిస్తున్నాం’ అన్నారు. చైనా పెట్టుబడులు రాకపోతే భారత్‌కు నిధుల కొరత వస్తుందేమోనన్న ప్రశ్నకు బదులిస్తూ ఆ దేశ పెట్టుబడులపైనే భారత్‌ ఆధారపడట్లేదని అన్నారు. భార‌తీయ సంస్థ‌లు బిడ్డింగ్‌లో పాల్గొనే విష‌యంలో ఆర్థిక, సాంకేతిక షరతులను సులభతరం చేస్తామని నితిన్ గ‌డ్క‌రీ స్ప‌ష్టం చేశారు.

 

 


ఇదిలాఉండ‌గా,  దేశ భద్రత, సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నాయని పేర్కొంటూ టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌ సహా 59 చైనా యాప్‌లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. ఇక దేశీయంగా యాప్‌ల రూపకల్పనను ప్రోత్సహించేందుకు నడుంకట్టింది. ప్రపంచ స్థాయిలో ‘మేడిన్‌ ఇండియా యాప్‌'లను రూపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ యాప్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌'ను ప్రకటించారు. భారత యాప్‌ డెవలపర్లు, ఇన్నోవేటర్స్‌ను ప్రోత్సహించేందుకు ఈ చాలెంజ్‌ను ప్రారంభించారు. టెక్‌ సంస్థలు ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సోషల్‌ నెట్‌వర్కింగ్‌, ఆఫీస్‌ ప్రొడక్టివిటీ/వర్క్‌ఫ్రమ్‌హోమ్‌, ఈ-లెర్నింగ్‌, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, న్యూస్‌, బిజినెస్‌, గేమ్స్‌ అనే ఎనిమిది క్యాటగిరీల్లో ఈ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: