తెలంగాణ‌లోని విశేషాల‌ను బాహ్యా ప్రపంచానికి తెలియజేసేందుకు ప్ర‌త్యేకమైన చొర‌వ‌తో ముందుకు రావ‌డం అభినంద‌నీయ‌మ‌ని రాష్ట్ర  ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్ర‌శంసించారు. తెలంగాణ రాష్ట్రంలో భౌగోళిక గుర్తింపు(జీఐ) పొందిన వస్తువులు, ఆహార, వస్ర్తాల సమగ్ర వివరాలతో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ-బుక్‌ను రూపొందించాయి. ఈ-బుక్‌ను ప్రగతిభవన్‌లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఆవిష్కరించారు. ఇలాంటి పుస్తకాల ద్వారా తెలంగాణ ప్రాంత హస్త, చేనేత, ఇతర కళాకారులు తయారుచేసే వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని ఆయ‌న ఆకాంక్షించారు.

 

ఒక ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు ఇచ్చే గుర్తింపును భౌగోళిక గుర్తింపు అంటారు. ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని వస్తువులకు సహజంగా ఓ నాణ్యత ఉంటుంది. అదే దాని ప్రత్యేకత. ఈ విశిష్టతను దృష్టిలో ఉంచుకుని ‘ది జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ ఆఫ్‌ గూడ్స్‌(రిజిస్ట్రేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ చట్టం)’-1999ని తీసుకొచ్చారు. దీని ప్రకారం భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులను వారి అనుమతి లేకుండా ఇతరులు తయారుచేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు. ఎవరైనా వ్యక్తులు తాము ఉత్పత్తి చేస్తున్న వస్తువుల ప్రత్యేకతలను తెలుపుతూ జీఐ చట్టం ప్రకారం రాతపూర్వకంగా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవాలి.  అనంతరం వారు ఈ మేరకు గుర్తింపు పొందుతారు. 

 

ఇదిలాఉండ‌గా, విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చే పర్యాటకులు.. ఈ జీఐ ఆధారిత బుక్​ ద్వారా ఆయా వస్తువులు తయారుచేసే ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఉన్న ప్రత్యేకతలను ప్రపంచానికి తెలిపేందుకు ఈ-బుక్‌ ఎంతగానో తోడ్పడుతుంది. కళలను ప్రోత్సహించడానికి, కళాకారుల కృషిని గుర్తించడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. జీఐ ఉన్న వాటికి మార్కెటింగ్‌, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తుంది. తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒకటిచొప్పున జీఐ పొందేలా కృషిచేయాల్సిన అవసరం ఉంటుంద‌ని సీఐఐ ప్ర‌తినిధులు అబిప్రాయప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: