దేశంలో ఓ వైపు కరోనాతో నానా కష్టాలు పడుతున్నారు ప్రజలు. దానికి తోడుగా ఇప్పుడు ప్రకృతి విపత్తుతో మరింత సతమతమవుతున్నారు.  ఇప్పటికే ఏపిలో పలు చోట్ల బీభత్సమైన వానలు కురుస్తున్నాయి.  దేశ వ్యాప్తంగా తుఫాన్లతో మత్స్యకారులు కష్టాల్లో పడుతున్నారు.  కరోనా మహమ్మారి మహారాష్ట్రపై విరుచుకు పడుతుంది.  ఇక్కడ దేశంలో మూడో వంతు కేసులు నమోదు అవుతున్నాయంటే ఎంత ప్రభావం ఉందో అర్థం అవుతుంది. ఇది చాలదన్నట్లు ఇఫ్పుడు వర్షాలు ప్రజలను నానా అవస్థలకు గురి చేస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ట్రాఫిక్ జామ్‌లు, లోతట్టు ప్రాంతాలు జలమయమవడం వంటివాటివల్ల ప్రజల విలువైన సమయం వృథా అవుతోంది.  ముంబాయిలో వరుసగా కురుస్తున్న వర్షాలతో అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. 

 

అంతంత మాత్రంగా వచ్చే ఆదాయంతో జీవించేవారు ఓవైపు అష్ట దిగ్బంధనం, మరో వైపు వర్షాలతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ముంబైలోని కొలాబా కోలీవాడకు చెందిన మత్స్యకారుడు జయేష్ భోయిర్ మాట్లాడుతూ, తన ఆర్థిక పరిస్థితులు ఈ వర్షాల వల్ల మరింత దెబ్బతిన్నట్లు తెలిపారు. తనకు చాలా స్వల్ప ఆదాయం వస్తుందని.. ఇప్పుడు ఈ వర్షాలు వచ్చి ఆ ఆదాయం కూడా లేకుండా చేస్తుందని.. తమకు చేపల విక్రయం మాత్రమే తెలుసని.. ఇప్పుడు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్-19 మహమ్మారి నిరోధానికి ప్రభుత్వం అమలు చేస్తున్న మార్గదర్శకాల వల్ల తమకు రెండు నెలల నుంచి ఆదాయం లేదని చెప్పారు.

 

తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. పుండు మీద కారం జల్లినట్లుగా అష్ట దిగ్బంధనానికి తోడుగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. మత్స్యకార నేతలు మాట్లాడుతూ, తాము పల్లపు ప్రాంతాల్లో జీవిస్తున్నామని, భద్రత పట్ల తమకు ఆందోళనగా ఉందని, అధికారులు తమకు సహాయపడాలని కోరారు.  మరోవైపు ముంబై పోలీసులు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, స్థానికులు సముద్రం వైపు వెళ్ళవద్దని, సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: