కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధమైంది భారత్. సరిహద్దుల్లో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ.. ఆక్రమణలకు దిగుతున్న డ్రాగన్ కు చెక్ పెట్టేందుకు ఢిల్లీ వ్యూహాలు రచిస్తోంది. గాల్వన్ లో భారత సైనికుల మరణానికి కారణమైన చైనాపై.. ప్రతీకారం తీర్చుకునేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. అదే సమయంలో అంతర్జాతీయంగా చైనాను కార్నర్ చేసేందుకు.. అన్ని పావులు కదుపుతోంది విదేశాంగ శాఖ. వీటితో పాటు ఇప్పటికే 59 యాప్స్ ను నిషేధించి డిజిటల్ స్ట్రైక్ ను ప్రారంభించింది భారత్. అదే బాటలోనే ఇతర దేశాలు పయనిస్తున్నాయి. ఇలా, యుద్ధరీతిలోనూ, అర్ధనీతిలోనూ, విదేశాంగ విధానంలోనూ త్రిశూల వ్యూహంతో ముందుకెళ్తోంది భారత్. 

 

భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. గాల్వన్ లోయలో భారత - చైనా  సైనికుల మధ్య ఘర్షణ జరిగినప్పటి నుంచి.. అక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.  చైనా మళ్లీ ఎలాంటి దూకుడు ప్రదర్శించినా.. డ్రాగన్ తోక కత్తిరించేందుకు భారత్ రెడీగా అవుతోంది.  చైనా సైనికులు దాడి చేస్తే.. గట్టిగా బదులివ్వడానికి ఆర్మీకి ఫ్రీహ్యాండ్ ఇచ్చింది మోడీ సర్కార్. అంతేకాకుండా స్వయంగా ప్రధాని మోడీ.. లడఖ్ లో పర్యటించి సైనికుల ఆత్మస్థైర్యాన్ని పెంచారు. ఈ పరిణామాలతో భారత సైన్యం రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అటు భారత వైమానిక దళం.. యుద్ధానికి సర్వ సన్నద్ధమైంది. ఫ్రంట్‌లైన్ జెట్లు, వైమానిక దాడిలో వినియోగించే హెలికాపర్లను, రవాణాకు సంబంధించిన విమానాలను.. వాస్తవ నియంత్రణ రేఖ వెంట గగన తలంలో కాపలాగా ఉంచుతోంది. అమెరికన్ సి-17 తో పాటు సి-130జె, రష్యాకు చెందిన ఇల్యూచిన్-76, ఆంటోనోవ్ -32 లాంటి వాటిల్లో దళాలను, సామాగ్రిని రవాణా చేయడానికి ఇప్పటికే వాయుసేన మోహరించింది. క్షిపణులు, రాకెట్లతో దాడి చేయగల అపాచీ పోరాట హెలికాప్టర్లు ముమ్మరంగా ఆకాశంలో గస్తీ తిరుగుతున్నాయి. ఎలాంటి ఆపరేషన్ చేయడానికైనా భారత వాయుసేన సిద్ధంగా ఉంది.

 

సరిహద్దు వైపునకు భారీగా ఆయుధాలను వాయుసేన తరలిస్తోంది. అదనపు బలగాలను తరలించడానికి ఐఎల్‌-76. ఏఎన్‌-32  విమానాలను ఉపయోగిస్తోంది. కీలకమైన లేహ్‌, శ్రీనగర్‌ వైమానిక స్థావరాల నుంచి బయలుదేరుతున్న సుఖోయ్‌-30 ఎంకేఐ, జాగ్వార్‌, మిరాజ్‌-2000 యుద్ధవిమానాలు ఎల్‌ఏసీ వెంబడి ముమ్మరంగా గస్తీ తిరుగుతున్నాయి. సైనిక బలగాలను చేరవేయడానికి చినూక్‌, ఎంఐ-17 వీ5 హెలికాప్టర్లను వాయు సేన ఉపయోగిస్తోంది. చైనా వైమానిక దళం తన కార్యకలాపాలను విస్తరించడంతో.. మన వాయుసేన కూడా హైఅలర్ట్ గా ఉంది. 

 

వాయుసేన సన్నద్ధతతో పాటు భారీ యుద్ధ ట్యాంకుల్ని కూడా భారత ఆర్మీ సిద్ధంచేసింది. సరిహద్దుల్లో చైనాకు చెక్ చెప్పాలన్న ఉద్దేశంతో  టి-72, టి-90లను కొన్నేళ్ల కిందటే తూర్పు లద్దాఖ్‌కు తరలించింది. ఇప్పుడు అవి డ్రాగన్‌పై గర్జించడానికి సిద్ధంగా ఉన్నాయి. తూర్పు లద్దాఖ్‌లో ఎత్తయిన పర్వతాలు, లోయలే అధికం. అక్కడి భౌగోళిక పరిస్థితులు, వాతావరణంలో మాములు యుద్ధట్యాంకులు పనిచేయలేవు. అయితే ఇలాంటి పరిస్థితుల కోసం.. యుద్ధ ట్యాంకులకు మార్పులు చేశారు. వీటిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచుతున్నారు. 
చైనా వెనక్కి తగ్గేవరకూ.. సరిహద్దుల్లో ఎంతకాలమైనా మోహరింపును కొనసాగించాలని భారత సేన భావిస్తోంది. మరోవైపు తూర్పు లద్దాఖ్‌ సెక్టార్‌లోకి మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణులను రంగంలోకి దించామని చైనా ప్రచారం చేస్తోంది. వీరికి దీటుగా భారత్.. ఘాతక్ కమెండోలను బరిలో దింపింది.

 

భారత్ తో మాత్రమే కాదు చైనాకు చాలా దేశాలతోనూ సమస్యలు ఉన్నాయి. తన విస్తరణ కాంక్షతో గిల్లికజ్జాలు పెట్టుకొని భూభాగాల్ని ఆక్రమించుకోవడమే పనిగా పెట్టుకుంది బీజింగ్.  తైవాన్ తోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయి. ఇటీవలే చైనా యుద్ధవిమానం ఒకటి.. తైవాన్ లో ప్రవేశించింది. దీంతో గుర్రుగా ఉన్న తైవాన్ కూడా.. చైనా ఆగడాలను చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తోంది. అటు దక్షిణ చైనా సముద్రంలో దీవుల్ని ఆక్రమించి.. ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత సృష్టిస్తోంది. దీంతో ఆ ప్రాంత దేశాలన్నీ కూడా డ్రాగన్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: