ఒక కరుడుగట్టిన నేరస్తుడిని పట్టుకోవాలనుకోవడమే ఆ పోలీసులు చేసిన తప్పు అయింది. కాసులకు కక్కుర్తిపడ్డ ఓ గుంటనక్క తమలోనే ఉందని తెలుసుకోకపోవడమే ఆ పోలీసుల పాలిట శాపంగా మారింది. ఎంతో మందిని అవలీలగా పట్టుకున్న డీఎస్పీ ర్యాంక్‌ అధికారి కూడా ఆ నేరస్తుడి స్కెచ్‌కి బలయ్యాడు. యూపీలో ఒకరు కాదు ఇద్దరు కాదు...మొత్తం ఎనిమిది మంది పోలీసులు... కరుడుగట్టిన నేరస్తుడి చేతిలో ప్రాణాలు వదిలారు. ఈ ఘటన యావత్‌ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది.

 

ఉత్తరప్రదేశ్‌..! కాన్పూర్‌..! జూలై 2 అర్థరాత్రి..! మోస్ట్ వాంటెట్‌ క్రిమినల్‌ వికాస్ దూబే తన ఇంటిలో నక్కి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది.  అతడిపై హత్య, దొంగతనాలు, కిడ్నాప్‌లతో సహా 60 కేసులు ఉన్నాయి. ఎంతో మందిని పక్కా స్కెచ్‌ వేసి చంపించేవాడు వికాస్‌ దూబే. ఈ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్ కోసం పోలీసులు రెండేళ్ల నుంచి వెతుకుతున్నారు. అయినా, పోలీసుల కంట చిక్కకుండా తప్పించుకుంటునే ఉన్నాడు. కాన్పూర్‌లోని తన ఇంట్లో ఉన్న ఆ కిరాతకుణ్ని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఆపరేషన్‌ ప్లాన్ చేశారు. ఎన్నో ఎన్‌కౌంటర్ లలో  క్రిమినల్స్‌ మట్టుబెట్టిన డీఎస్పీ దేవేంద్ర మిశ్రాని ఈ ఆపరేషన్‌కు లీడ్‌గా ఉన్నతాధికారులు నియమించారు. డీఎస్పీతో పాటు 16 మంది పోలీసుల బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొంది.



వికాస్‌ దూబే గ్యాంగ్‌ను పట్టుకునేందుకు 16 మంది పోలీసు బృందం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో  అతని నివాసం ప్రాంతానికి వెళ్లింది. కానీ, పోలీసుల వస్తున్న సమాచారాన్ని డిపార్ట్‌మెంట్‌లోని అమ్ముడుపోయిన ఓ అధికారి వికాస్‌కు సమాచారమిచ్చాడు.  ఎన్నో మర్డర్లకు స్కెచ్ వేసిన అనుభవం ఉన్న వికాస్ ఈ సమాచారం తెలుసుకోగానే అలర్ట్‌ అయ్యాడు. పోలీసుల కన్నా ఓ అడుగు ముందుగానే తన ప్లాన్‌ని అమలు చేశాడు. పోలీసులు వచ్చే రోడ్లన్నీ తన అనుచరులతో మూసివేశాడు.  తామున్న భవనం వద్దకు రాకుండా జేసీబీని అడ్డుపెట్టి రోడ్డును బ్లాక్‌ చేశాడు. 

 

విషయం తెలియని పోలీసులు .. రోడ్డు మూసివేయడంతో తమ వాహనాల నుంచి దిగారు. వికాస్ ఉండే భవనం వద్దకు కాలినడకతో వెళ్లారు. ఇదే అదునుగా భావించిన వికాస్‌ దూబే గ్యాంగ్ రెచ్చిపోయింది.  భవనం చేరువలోకి వచ్చిన పోలీసు బృందంపై కాల్పులు జరిపింది రౌడీషీటర్‌ గ్యాంగ్‌. కాల్పులు ప్రారంభమైన వెంటనే కొంతమంది పోలీసులు పక్కనే ఉన్న వేరే భవనంలోకి వెళ్లారు. కానీ ఆ భవనం కూడా వికాస్‌ అనుచరుడిదని పోలీసులకు తెలియదు. దీంతో దూబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో డిఎస్పీ దేవేంద్ర మిశ్రాతో సహా ముగ్గురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇంకొంతమంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
ట్రాప్ చేసేందుకు వచ్చిన పోలీసుల్నే ట్రాప్ చేసి.. వారిని పొట్టనబెట్టుకున్నాడు.. ఈ గ్యాంగ్ స్టర్. 

 

పోలీసులపై కాల్పులు జరిపిన ముఠా అక్కడి నుంచి  సమీపంలోని అటవీప్రాంతంలోకి  పారిపోయింది. మృతిచెందిన, గాయపడిన పోలీసుల వద్ద ఉన్న ఏకే47, ఇన్సాస్‌ రైఫిల్, గ్లాక్‌ పిస్టల్, రెండు 9 ఎంఎం పిస్టళ్లను వికాస్‌ దూబే అనుచరులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో వికాస్‌ అనుచరులైన ప్రేమ్‌ ప్రకాశ్, అతుల్‌ దూబే అనే ఇద్దరు హతమయ్యారు. దూబె తలుచుకుంటే ఏమైనా చేస్తాడని పోలీసులకే బాగా తెలుసు. అందుకే అతడిపై ఉన్న కేసులను దృష్టిలో పెట్టుకుని..అరెస్ట్‌ చేయాలని శతవిధాలా ప్రయత్నించారు. కానీ. పోలీసుల మీదకే దూబె అనుచరులైన రౌడీషీటర్లు ఎదురుకాల్పులకు దిగడంతో.. పోలీసులు చనిపోవాల్సి వచ్చింది. ఒక రౌడీషీటర్‌ ఇంతమంది పోలీసులను చంపడంతో యావత్‌ భారతదేశం ఉలిక్కిపడింది.

 

విషయం తెలియగానే  కాల్పులు జరిగిన ప్రాంతానికి ఇద్దరు ఎస్పీ, డీఐజీలతో పాటు ఫోరెన్సిక్ బృందాలు వచ్చాయి. ఎస్పీలు దినేష్‌కుమార్‌, అనిల్‌కుమార్ బృందాలు క్రిమినల్స్‌ కోసం గాలిస్తున్నాయి. కాన్పూరు సరిహద్దులను మూసేశారు. క్రిమినల్‌ వికాస్‌ దుబేతో కాంటాక్ట్‌లున్న సుమారు 100 మంది ఫోన్లను పోలీసులు ట్రేస్‌ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: