మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ....అమరావతి రైతులు 200 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీ సైతం అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ...ఆందోళనలు కూడా చేసింది. అయితే తాజాగా అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నేతలు రైతులకు మద్ధతుగా ఒకరోజు దీక్ష చేశారు.

 

అమరావతి ఉద్యమం మరోసారి తెరపైకి రావడంతో, మూడు రాజధానులు అంశం కూడా బయటకొచ్చింది. తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని, అలాగే అమరావతి రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే క్రమంలో విశాఖ ఆర్ధిక రాజధానిగా ఉండటం ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు, ఎమ్మెల్యేలకు ఇష్టం లేదా? అంటూ మంత్రులు ప్రశ్నిస్తున్నారు.

 

తాజాగా ఇదే అంశంపై మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ... కొంతమంది రాజకీయ నిరుద్యోగులు...అమరావతి అంటే ప్రేమ ఉన్నట్టు, తమకు లేనట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతి అభివృద్ధి చేయాలంటే 30 సంవత్సరాలు పడుతుందని, చంద్రబాబు నాయుడు జూమ్ రాజకీయాలతో ఆర్గనైజ్ చేశారని ఫైర్ అయ్యారు. ఇక అమరావతి కావాలో.. విశాఖ కావాలో... దమ్ముంటే నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి  చూద్దాం అని సవాల్ విసిరారు.

 

2019 ఎన్నికల్లో విశాఖ నగరంలోని నాలుగు సీట్లని టీడీపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ సీట్లు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇక వారినే ఇప్పుడు అమరావతికి మద్ధతుగా రాజీనామా చేయించాలనే ఉద్దేశంతో మంత్రి మాట్లాడారు. అయితే నలుగురు ఎమ్మెల్యేలకు విశాఖని ఆర్ధిక రాజధానిగా చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అధినేత చంద్రబాబు అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తుండటంతో, ఈ నలుగురు ఎమ్మెల్యేలకు విశాఖకు మద్ధతు తెలపలేకపోతున్నారు. అదేవిధంగా స్థానిక పరిస్థితుల వల్ల అమరావతికి జై కొట్టలేకపోతున్నారు.

 

కాకపోతే జగన్ విశాఖని ఆర్ధిక రాజధానిగా ప్రకటించినప్పుడే ఈ నలుగురు ఎమ్మెల్యేలు వీక్ అయిపోయారు. కాబట్టి వీరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడం జరగని పని. ఎందుకంటే మళ్ళీ వీరు ఎమ్మెల్యేలు గెలవడం కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: