రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చి, అందులో ఇళ్ళు కట్టించాలనే ఉద్దేశంతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే జూలై 8న రాష్ట్రంలోని 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. అయితే పేదలకు పంపిణీ చేసే ఈ ఇళ్ల పట్టాల్లో వైసీపీ నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని అనేక ఆరోపణలు వచ్చాయి.

 

వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా అక్రమాలు చేశారని టీడీపీ నేతలు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు. అలాగే కొందరు న్యూట్రల్ వ్యక్తులు కూడా ఇళ్ల పట్టాల కోసం కొనుగోలు చేసిన భూముల్లో పలు అక్రమాలు జరిగాయని బహిరంగంగానే చెబుతూ వచ్చారు. భూములు కొనుగోలు కోసం ప్రభుత్వం వద్ద నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుని, భూములు అమ్మిన రైతులకు తక్కువ చెల్లించారని తెలిసింది. ఇక అందులో ఉన్న డబ్బులని వైసీపీ నేతలు నోక్కేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 

అలాగే వైసీపీ నేతల భూములని ఇళ్ల స్థలాలకు ఇచ్చారని, అక్కడ కూడా తక్కువ రేటు ఉన్న భూములని నాలుగైదు రేట్లు ఎక్కువ ధరకు ప్రభుత్వానికి ఇచ్చారని చెబుతున్నారు. ఇక వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇళ్ల పట్టాల్లో అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు తన 100 ఎకరాల పొలాన్ని మార్కెట్‌ ధర కంటే 3 రెట్లు అధికంగా అమ్మారని తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం మార్కెట్ రేటు కంటే ఎక్కువ చెల్లించి కొంటున్నారని, ఆ భూములన్నీ వైసీపీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులవేనని జవహర్ ఆరోపించారు.

 

అయితే అనేక మంది వైసీపీ నేతలు ఇళ్ల పట్టాల్లో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి, వాళ్ళ పేర్లని చెప్పకుండా, కేవలం కమ్మ సామాజికవర్గానికి చెందిన వినుకొండ ఎమ్మెల్యే పేరునే జవహర్ బయటపెట్టడం వెనుక ఏదో బలమైన కారణం ఉందేమో అని రాజకీయ వర్గాలు చర్చికుంటున్నాయి. మరి ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడినట్లు జవహర్ వద్ద ఏమన్నా ఆధారాలు ఉన్నాయో? లేక ఏదో నోటికి వచ్చినట్లు చెప్పేశారో? 

మరింత సమాచారం తెలుసుకోండి: