కొండ‌పోచ‌మ్మ‌సాగ‌ర్ ప‌నుల‌ను తాను చేసిన‌ట్లుగా ప్ర‌చారం చేస్తున్న కాంగ్రెస్ నాయ‌కులు నిరూపించాల‌ని ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యే కందాళా ఉపేంద‌ర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కొండపోచమ్మ సాగ‌ర్‌లో  నేను కాంట్రాక్టు పనులు చేశానని రుజువు చేస్తే  నా పదవికి రాజీనామా చేస్తా, నిరూపించ‌కుంటే ఆరోపణలు చేసిన వారు పదవులకు రాజీనామా చేయ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ భ‌ట్టి విక్ర‌మార్క‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీని ఉద్దేశించి అన్నారు. ఎమ్మెల్యే ఉపేంద‌ర్ రెడ్డి ఆదివారం సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌పై వచ్చిన ఆరోప‌ణ‌ల‌కు వివ‌ర‌ణ ఇచ్చారు.


 కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేకుండా బాధ్యతారహితంగా నేను కాంట్రాక్ట్ వర్క్ చేశానని తప్పుడు సమాచారంతో మాట్లాడటం వారి అవివేకానికి నిద‌ర్శ‌న‌మని అన్నారు. రాష్ట్రంలో ఉపేందర్ రెడ్డి పేరుతో 100 మంది ఉండొచ్చు కానీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అనుకోవడం సమంజసమా? అంటూ ప్ర‌శ్నించారు.  కొండపోచమ్మ సాగర్ లో నేను కాంట్రాక్టు పనులు చేశానని రుజువు చేస్తే, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నానని మ‌రోసారి స్ప‌ష్టంగా చెబుతున్న‌ట్లు ఉద్ఘాటించారు. కొండపోచమ్మ సాగర్ లో నేను కాంట్రాక్ట్ పనులు చేయలేదని రుజువైతే, నా గురించి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు వారి పదవులకు రాజీనామా చేయాల‌ని స‌వాల్ విసిరారు.లేనిపక్షంలో నాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ ఘాటుగా విమర్శించారు.  


గ‌త 39 ఏళ్లుగా దీపిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తాను కాంట్రాక్ట్ ప‌నులు నిర్వ‌హిస్తున్న మాట నిజం. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దాదాపు పదకొండు రాష్ట్రాల్లో కొన్ని వేల కాంట్రాక్ట్ లు చేశాన‌ని చెప్పారు.  ఎక్కాడా, ఎలాంటి చిన్న తప్పులు కూడా జరగలేద‌ని అన్నారు.తమ సంస్థ‌పై ఎలాంటి రీమార్క్ రాలేద‌ని, రాబోకుండా చూసుకుంటామ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో నేను ఒక చిన్న వర్కు కూడా చేయలేద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు.  కాంగ్రెస్ నాయకులు ఇలా చేయడంతోనే ప్రజల్లో ఉన్న  విశ్వాసాన్ని కోల్పోతున్నారని అన్నారు. చౌకబారు రాజకీయాలు చేస్తూ, లేనిపోని ఆరోపణలు చేయటం తగదని, ఎప్పటికీ ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: