తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజూ వేల కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. ఏకంగా కేసీఆర్ నివాసం ప్రగతి భవన్‌ కు కూడా కరోనా సెగ తగిలింది. దాదాపు 30 మంది వరకూ ప్రగతి భవన్‌లో కరోనా బారిన పడ్డారని వార్తలు వచ్చాయి. అంతే కాదు.. కేసీఆర్ కూడా కరోనా భయంతోనే ప్రగతి భవన్ కు రావడం లేదని.. ఆయన తన ఫామ్‌ హౌజ్‌కే పరిమితం అయ్యారని పుకార్లు షికారు కొడుతున్నాయి. 

 


అయితే.. కరోనా భయంతో కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు వెళ్లారన్న వార్తల్లో నిజం ఎంతో తెలియదు. కానీ తెలంగాణలో ప్రతిపక్షాలు మాత్రం అదే విషయాన్ని వల్లెవేస్తున్నాయి. తాజాగా... భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే మాట చెబుతున్నారు. మేధావులు, విద్యావంతులు, ప్రజలు కేసీఆర్‌ వైఖరిని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రగతి భవన్‌లో కరోనా కేసులు వచ్చాయని.. కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కు వెళ్లారని కోమటిరెడ్డి అన్నారు. 

 

 

కరోనా వైరస్ వ్యాప్తిలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలం అయ్యారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. తెలంగాణకు ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టమని ఆయన కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ ఇకనైనా ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ ప్రభుత్వాలను చూసి నేర్చుకోవాలని కోమటి రెడ్డి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పది లక్షలకు పైగా కరోనా టెస్టులు చేస్తే.. అదే తెలంగాణలో మాత్రం లక్ష టెస్టులు మాత్రమే చేశారని ఆయన గుర్తు చేస్తున్నారు. కరోనా ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

 


మరోవైపు ఏకంగా కేసీఆర్‌కు కరోనా సోకిందంటూ ఓ పేపర్ క్లిప్పింగ్‌ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆదాబ్ హైదరాబాద్ అనే పత్రికలో ఈ వార్త వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రగతి భవన్‌లో కరోనా కేసులు రావడంతో ఇలాంటి పుకార్లకు ఊతం లభిస్తోంది. అయితే ఇలాంటి వార్తలపై సీఎం కార్యాలయం వివరణ ఇస్తే బావుంటుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: