ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని జగన్ సర్కారు ఇప్పటికే నిర్ణయించింది. అయితే ఆ ప్రయత్నానికి ముందు శాసన మండలి, ఇప్పుడు కరోనా అడ్డుపడ్డాయి. అయితే రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడం ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ.. తరలింపు మాత్రం పక్కా అంటున్నారు. 

 

 


ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మాత్రం.. మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తోంది. స్వయంగా చంద్రబాబే ఆ కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది కూడా. అయితే రాజధాని తరలింపును ఆపేందుకు చంద్రబాబుకు ఓ మంచి ఐడియా ఇస్తున్నారు వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్. 

 

 


అదేంటంటే.. విశాఖ ప్రాంతంలో టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ ఎలాగూ విశాఖను రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తోంది కాబట్టి.. ఆ నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. మళ్లీ గెలిపిస్తే.. ఇక వైసీపీ రాజధాని తరలింపు ఆలోచన చేయదు కదా అంటూ బ్రహ్మాండమైన ఐడియా ఇస్తున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా వద్దని అంటున్న చంద్రబాబు విశాఖలోని తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని మంత్రి అవంతి సవాల్ చేస్తున్నారు. 

 

 


చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే.. అప్పుడు ప్రజాభిప్రాయం ఏమిటో తెలుస్తుందని అవంతి అంటున్నారు. విశాఖ పట్ల ద్వేషంతో చంద్రబాబు మాట్లాడడం తగదని ఆయన అన్నారు. అంతే కాదు.. తమకు అమరావతిపై ఎలాంటి అభ్యంతరం లేదని.. అది శాసన రాజధానిగా ఉంటుందని.. అక్కడి వారికి అన్యాయం చేయాలని జగన్ ప్రభుత్వం అనుకోవడం లేదని మంత్రి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. మరి ఈ ఐడియా ఏదో బాగానే ఉంది కదా.. చంద్రబాబు అలా చేస్తారా మరి.? 

మరింత సమాచారం తెలుసుకోండి: