అమరావతి అమరావతి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కలవరిస్తూనే ఉన్నారు. తాము అధికారంలోకి లేకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తిందని, అదే తాము అధికారంలో ఉండి ఉంటే, అమరావతి ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయి ఉండేదని, అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకునేంది అని, కానీ వైసీపీ ప్రభుత్వం అమరావతి ప్రాంత వాసుల బాధలు, ఇబ్బందులను పట్టించుకోవడం లేదని, చంద్రబాబు ఇప్పుడు తెగ బాధపడుతున్నారు. అక్కడితో ఆగకుండా అమరావతి జేఏసీ పేరుతో ఒక ఉద్యమాన్ని వెనక ఉండి నడిపిస్తున్నారు. కరోనా వచ్చిన లాక్ డౌన్ విధించినా, ఆగకుండా ఈ అమరావతి దీక్ష కొనసాగిందని, ఆ గొప్పతనం అంతా తనదే అని  బాబు గోప్పగా చెప్పుకుంటున్నారు.

 

IHG

ఇప్పటికే 200 రోజులు ఈ అమరావతి దీక్ష పూర్తయిన సందర్భంగా, స్థానిక ప్రజలు కొంతమంది మరోసారి  హడావుడి చేశారు. కానీ గతంలో ఉన్నంత ఊపు, ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు.అమరావతి ఉద్యమం మొదలైన సమయంలో 175 నియోజకవర్గాల్లోనూ, అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. దీనికి తోడు టీడీపీ అనుకూల మీడియా కూడా, ఈ ఉద్యమాన్ని గట్టిగానే హైలెట్ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆ విధంగా లేదనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు అమరావతి ఉద్యమం మరింత ఉధృతంగా సాగుతోందని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కేవలం అమరావతి పరిసర ప్రాంతాల్లో కొంత మంది ప్రజలు మాత్రమే, ఈ ఉద్యమంలో పాల్గొంటున్నట్లుగా కనిపిస్తున్నారు తప్ప మిగతా ఎక్కడా, దీనికి సంబంధించిన హడావుడి కనిపించడం లేదు.

 

IHG

ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఎవరూ, ఈ అమరావతి వ్యవహారంలో తలదూర్చేందుకు ఇష్ట పడడం లేదు. ఒక వేళ అలా చేసినా, ఆ ప్రాంతంలో వ్యతిరేకత మూటగట్టుకోవాలనే విషయం నాయకులకు బాగా తెలుసు. అదీ కాకుండా, ప్రస్తుతం కరోనా కారణంగా, ఇల్లు దాటి బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. అయినా టిడిపి అధినేత చంద్రబాబు ఈ ఉద్యమానికి మరింత ఊపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ పార్టీ నాయకులలోనే ఈ అమరావతి ఉద్యమంపై అంత ఆసక్తి కనిపించడం లేదు. అయినా దీనికి సంబంధించిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలంటూ బాబు పిలుపునివ్వడం, ఈ కరోనా సమయంలోనూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు తెలియజేయాలని చెప్పడంపై తెలుగు తమ్ముళ్లు అధినేత తీరుపై మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: