ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇళ్లు లేని వారందరికీ ఇళ్లపట్టాలు పంపిణీ చేయడంతో పాటు ఆ స్థలాలలో ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ మేరకు జగన్ ఉగాది పండుగ సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల వల్ల ఈ కార్యక్రమం జరగలేదు. 
 
అనంతరం ప్రభుత్వం ఏప్రిల్ 14న పంపిణీ చేయాలని భావించినా పలు ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ ఇషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో ఆ కార్యక్రమాన్ని మళ్లీ వాయిదా వేశారు. అనంతరం జులై 8వ తేదీన వైయస్సార్ జయంతి సందర్భంగా 30 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని సీఎం భావించారు. కానీ జగన్ సర్కార్ తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మళ్లీ వాయిదా వేసింది. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే సమయంలో ప్రజలంతా ఒకేసారి గుంపుగా చేరే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ సమయంలో ఇళ్ల పట్టాల పంపిణీ రిస్క్ అని భావిస్తోంది. కరోనా విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉన్న కారణంగా ప్రభుత్వం ఈ పథకాన్ని వాయిదా వేసింది. ఇప్పటికే వివిధ కారణాల వల్ల ఈ పథకం మూడుసార్లు వాయిదా పడింది. 
 
ప్రభుత్వం ఆగష్టు 15న ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే అప్పట్లోపు వైరస్ ప్రభావం తగ్గితే మాత్రమే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో వైరస్ విజృంభణ తగ్గితే మాత్రమే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: