కరోనాను కట్టడి చేయడం పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇంత వరకూ వాడుతున్న మందులు నిష్ప్రయోజనం అని తేల్చి చెప్పింది డబ్ల్యూహెచ్ ఓ. మరోవైపు... కరోనా గాలి ద్వారా వ్యాపిస్తోందని... వ్యక్తిగత దూరం పాటించినంత మాత్రాన సరిపోదంటున్నారు కొందరు పరిశోధకులు. అంతేకాదు... డబ్ల్యూహెచ్ ఓ మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని చేర్చాలని కోరుతున్నారు.  

 

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌... మొదట్లో ఈ మందును కరోనా బాధితుల పాలిట సంజీవనిగా భావించారు. మలేరియా బాధితులకు ఇచ్చే ఈ మందుతో కరోనాను నయం చేయవచ్చనుకున్నారు. కానీ... కరోనా చికిత్సలో ఆ డ్రగ్‌ నిరుపయోగమని తేల్చేసింది వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ . అదేకాదు... హెచ్ఐవీ ఎయిడ్స్‌ బాధితులకు వాడే లోపినవిర్, రైటోనవిర్ కాంబినేషన్ డ్రగ్స్ పరిస్థితి కూడా అదే. ఇతర మందులతో పోల్చి చూస్తే... వీటి పనితనం తక్కువగా ఉంది. వీటి సాయంతో కరోనా రోగుల్లో మరణాలు  ఆపలేకపోతున్నట్టు డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది. దీంతో తక్షణమే వాటి ట్రయల్స్‌ ఆపివేస్తున్నట్టు ప్రకటించింది.   

 

మలేరియాకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ చాలా మంచి మందని... వ్యాఖ్యానించిన అమెరికా అద్యక్షుడు ట్రంప్‌ మనపై ఒత్తిడి పెంచిమరీ దానిని తీసుకెళ్లారు. అయితే, కరోనా చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ పనితనం ఆశించిన స్థాయిలో లేదని పలువురు వైద్య నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు డబ్ల్యూహెచ్ ఓ కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ క్లినికల్ ట్రయల్స్  నిలిపివేస్తున్నట్టు ప్రకటించడం విశేషం.   

 

మరోవైపు... కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తిస్తోందంటున్నారు 32 దేశాలకు 239 మంది పరిశోధకులు. కరోనా సోకిన వ్యక్తి దగ్గినా, లేదా తుమ్మినప్పుడు డ్రాప్లెట్స్‌ ద్వారా బయటకొచ్చే వైరస్‌... గాల్లో కలిసిపోయి గదంతా వ్యాపిస్తోందని చెబుతున్నారు. ఈ గాలిని ఇతరులు పీల్చినప్పుడు వాళ్లకు కూడా వైరస్‌ వ్యాపిస్తోందంటున్నారు. కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందనే విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ తన మార్గదర్శకాల్లో చేర్చాలని కోరుతున్నారు.  

 

ఇప్పటి వరకూ కరోనా సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వెలువడే డ్రాప్లెట్స్‌ వల్ల కరోనా వ్యాపిస్తోందని డబ్ల్యూహెచ్ ఓ చెబుతోంది. అందువల్ల 6 అడుగుల వ్యక్తిగత దూరం పాటించాలంటోంది. అయితే పరిశోధకులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే... కేవలం వ్యక్తిగత దూరం పాటించినంత మాత్రాన కరోనా నుంచి తప్పించుకోలేమని స్పష్టమవుతోంది. అయితే, దీనిపై డబ్ల్యూహెచ్ ఓ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: