కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి గ‌త కొద్దికాలంగా త‌న‌దైన శైలిలో ఘాటు కామెంట్లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రోమారు ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఈ ద‌ఫా విలేక‌రుల స‌మావేశంలో కాకుండా వీడియో రూపంలో స్పందించారు. త‌న వీడియో సీఎం కేసీఆర్‌తో స‌హా మంత్రుల‌కు చేరాలంటూ జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

 


ఈ వీడియోలో  ఆవేదనతో  మాట్లాడుతున్నాన‌ని  ప్రభుత్వంపై ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి విరుచుకుప‌డ్డారు. ``ఈ వీడియో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరకు చేరాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఒక నీచమైన, దుర్మార్గమైన పాలన  కొనసాగుతుంది. సరైన వైద్యం అందక ప్రజలు చనిపోతున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ లోని 17 వార్డ్  కౌన్సిలర్ గౌసియా బేగం కరోనాతో మృతి చెందారు. గత అయిదు రోజుల నుండి ఆమె చికిత్స కోసం తిరగని హాస్పిటల్ లేదు. కానీ ఎక్కడా బెడ్స్ ఖాళీ లేవు. ప్రతి హాస్పిటల్ దగ్గర వెయిటింగ్ లిస్ట్ ఉంది. వెంటిలేట‌ర్లు లేవు. ఆక్సిజన్ లేదు. చివరికి గాంధీ హాస్పిటల్‌లో చేర్పించగ‌లిగాం. కానీ ఆక్సిజన్ అందక  చనిపోయింది`` అని ఆవేదన ‌వ్య‌క్తం చేశారు. 

 

ఒక ఎమ్మెల్యేగా ఉన్న త‌నకే ఎంత ప్రయత్నించినా బెడ్స్ దొరకలేదని జ‌గ్గారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ``
ఒక కౌన్సిలర్‌ను కాపడుకోలేకపోయాం. ఇక సామన్య ప్రజల పరిస్థితి ఏంటి..?  జిల్లా మంత్రిగా ఉండి హరీష్ రావు జిల్లా హాస్పిటల్ పరిస్థితి తెలుసుకోలేదు. కరోనాతో కోలుకున్న వారికి ఫోన్ చేయడం కాదు కరోనా పేషెంట్ల‌కు చేసి చికిత్స విష‌యంలో ఎలాంటి పరిస్థితి ఉందొ తెలుసుకోవాలి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం చేస్తున్నావు..ఎక్కడ ఉన్నావు.. ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఇందుకేనా...? మానవత్వం అనేదే లేదా మీకు? సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు క‌రోనా వస్తే ఏం కాదు ఎలాగో అలా చికిత్స చేపించుకుంటాం. రాష్ట్రం లో ఐ ఏఎస్ ,ఐపీఎస్ లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సామన్య ప్రజలకు అలాంటి పరిస్థితి ఉండదు. ఇకనైనా సీఎస్,డీజీపీ లు మానవత్వం తో పని చేయాలి `` అని జ‌గ్గారెడ్డి అన్నారు.

 

సీఎంతో మాట్లాడే అవకాశం ఉన్న వారు ముఖ్య‌మంత్రికి వాస్తవ పరిస్థితులు ఏంటో చెప్పండని జ‌గ్గారెడ్డి సూచించారు. ``ప్రతిసారి జీతం కోసం కాదు కొన్ని సార్లు మానవత్వంతో పని చేయండి. అధికారులు, మంత్రులు కేసీఆర్‌కి ఊడిగం చేసింది చాలు. ఇకనైనా కేసీఆర్‌కు భజనలు చేయడం మానేసి మానవత్వంతో పని చేయండి.`` అని వ్యాఖ్యానించారు. ``మీకు మంచి పేరుంది ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు. ప్రజలను కాపడుకోలేన్నప్పుడు ఎందుకు మంత్రి పదవిలో ఉన్నారు? మంత్రి పదవికి రాజీనామా చేయాలి. కేసీఆర్ ఇకనైనా రంగప్రవేశం చేసి ప్రజల ప్రాణాలను కాపాడండి. తక్షణమే కేసీఆర్ 1 లక్ష వెంటిలేటర్లు,2 లక్షల ఆక్సిజన్ లను ఏర్పాటు చేయాలి. వెంటనే గాంధీ ఆస్పత్రి కి 3 వేల కోట్లు,జిల్లాల ఆసుపత్రులకు 2 వేల కోట్ల విడుదల చేయాలి. లేదంటే ట్యాంక్ బండ్ దగ్గర కూర్చొని నిరసన తెలుపుతా`` అని జ‌గ్గారెడ్డి  వ్యాఖ్యానించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: