ఇప్పుడు అంద‌రి చూపు క‌రోనా క‌ల‌క‌లం పైనే. ఈ మ‌మ‌మ్మారి విస్తృతం అవ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంద‌రో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ముప్పు త‌గ్గించుకునేందుకు అంద‌రి చూపు వ్యాక్సిన్‌పై ప‌డింది. కోవిడ్‌ -19ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ ఆగస్టు 15వ తేదీ లోపు అందుబాటులోకి రావాలని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ఆదేశాలివ్వడంతో త్వ‌ర‌లోనే వాక్సిన్ వ‌చ్చేస్తుంద‌ని భావిస్తున్నారు. అయితే, ఈ విష‌యంలో తాజాగా షాకులు త‌గులుతున్నాయి. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ పూర్తికావడానికి కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు.  కొవాగ్జిన్‌, జైకోవ్‌-డీతో పాటు కరోనా చికిత్సకు ప్రయోగాలు జరుపుకుంటున్న ఏ వ్యాక్సిన్‌ కూడా 2021 కంటే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశంలేదని తెలిపింది. దీంతో అనేక‌మంది నిరాశ‌కు లోన‌వుతున్నారు.

 


డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్ తాజాగా క‌రోనా వ్యాక్సిన్ గురించి స్పందిస్తూ, వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఏ వ్యాక్సిన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నా ట్రయల్స్‌ నిర్వహించడం ముఖ్యమని తెలిపారు. దీనికి కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని వివరించారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం అన్ని జరిగితేనే ఇది సాధ్యమని వెల్లడించారు. త‌ద్వారా కరోనా టీకా ఇప్పట్లో వచ్చే అవకాశంలేదని పరోక్షంగా వివరించారు. 

 

మ‌రోవైపు మినిస్ట్రీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఓ ప్రకటనలో కీల‌క విష‌యాలు వెల్లడించింది. ‘కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం ఆరు భారతీయ ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.  కొవాగ్జిన్‌, జైకోవ్‌-డీ వ్యాక్సిన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 140 వ్యాక్సిన్‌లు ప్రయోగదశలో ఉన్నాయి. ఇందులో 11 వ్యాక్సిన్‌లు హ్యూమన్‌ ట్రయల్స్‌ దశకు చేరుకున్నాయి. అయితే, ఇందులో ఏ ఒక్క వ్యాక్సిన్‌ కూడా 2021 కంటే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదు’ అని తెలిపింది. `వ్యాధిని కట్టడి చేసే వ్యాక్సిన్‌ అభివృద్ధి మూడు దశల ట్రయల్స్‌లో జరుగుతుంది. తొలి రెండు దశల్లో వ్యాక్సిన్‌ సురక్షితమా? కాదా? అనే వాటిపై పరీక్షలు జరుపుతారు. మూడో దశలో వ్యాక్సిన్‌ సమర్థతపై పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో దశ పూర్తికావడానికి నెలల నుంచి సంవత్సరాల సమయం పడుతుంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌', జైడూస్‌ కాడిలా సంస్థ అభివృద్ధి చేసిన ‘జైకోవ్‌-డీ’ వ్యాక్సిన్‌లకు తొలి రెండు దశల ట్రయల్స్‌ నిర్వహించడానికి ఈ వారంలోనే అనుమతులు లభించాయి. దీన్నిబట్టి చూస్తే ఆయా వ్యాక్సిన్‌లు పూర్తిస్థాయిలో పరీక్షలు జరుపుకోవాలంటే కొన్ని నెలల సమయం పట్టొచ్చు అని విశ్లేష‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: