ఈరోజు మధ్యాహ్నం నుంచి చైనా సైనికులు వెనక్కు వెళుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఒకసారి వెనక్కు వెళ్లినట్టే వెళ్లి ఘర్షణ వివాదం సృష్టించిన చైనా తాజాగా మరోసారి వెనక్కు వెళ్లటానికి సిద్ధమైంది. జూన్ 6వ తేదీన జరిగిన సమావేశంలో ఇరు దేశాలు సైనికులను వాస్తవాధీన రేఖ ప్రాంతం నుంచి వెనక్కు పంపించాలని నిర్ణయం తీసుకున్నాయి. గల్వాన్ లోయ తమదేనంటూ చైనా చేసిన వ్యాఖ్యల వల్ల వివాదం మొదలైంది. 
 
భారత్ మాత్రం 60 శాతం గల్వాన్ లోయ తమకు చెందిన భాగమని.... 40 శాతం చైనా భూభాగమని చెబుతోంది. మా భూభాగంలో ఏమైనా నిర్మాణం చేసుకుంటామని.... ఆ భూభాగం గురించి ప్రశ్నించడానికి చైనాకు హక్కు లేదని భారత్ వ్యాఖ్యలు చేసింది.యుద్ధానికి సిద్ధమని డ్రాగన్ ప్రకటించగా ఒక్క గజం భూమిని కూడా ఇచ్చే పరిస్థితి లేదని భారత్ చైనాకు తేల్చి చెప్పింది. ప్రధాని మోదీ చైనా సామ్రాజ్యవాద కాంక్ష మానుకోవాలని చెప్పారు. 
 
ఇదే సమయంలో తైవాన్, ఫిలిప్పీన్స్, జపాన్ లాంటి దేశాలు ఎదురు తిరగడం... అమెరికా ఏకంగా యుద్ధసైనికులను తీసుకొచ్చి మోహరించటంతో చైనా సైనికులు ఎట్టకేలకు రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్లారు. ప్రపంచ దేశాలు చైనాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ భారత్ కు తమ మద్దతు ప్రకటించాయి. భారత్ జోలికి వస్తే పదుల సంఖ్యలో దేశాలు డ్రాగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 
 
అయితే గతంలో చైనా కవ్వింపు చర్యల దృష్ట్యా భారత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. సరిహద్దు ప్రాంతం నుంచి భారత్ భారీ వాహనాలను తరలించినా చిన్న వాహనాలను మాత్రం అక్కడే ఉంచింది. డ్రాగన్‌ దొంగదెబ్బకు భారత్ ధీటుగా స్పందిస్తుండటంతో చైనా వెనక్కు వెళుతోంది. బలగాల ఉపసంహరణలో చైనా ఎంతమేరకు నిజాయితీగా వ్యవహరిస్తుందో తెలియాలంటే మరికొంత సమయం వేచిచూడక తప్పదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    

మరింత సమాచారం తెలుసుకోండి: