ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతుంది. ప్రపంచంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఆదివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2,12,000 కొత్త కేసులు నమోదవగా,  3586 మంది మరణించారు. ఈ కొత్త కేసుల్లో 60 శాతం అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లోనే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది.  అగ్రరాజ్యం అమెరికాలో నిన్న 40వేలకు పైగా కేసులు నమోదవడంతో మొత్తం కరోనా కేసులు 30 లక్షలకు చేరువలో ఉన్నది. దేశంలో ఇప్పటివరకు 29,82,928 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల 1,32,569 మంది మరణించారు. లాటిన్‌ అమెరికా దేశమైన బ్రెజిల్‌లో కరోనా కేసుల సంఖ్య 16,04,585కు చేరింది.  అయితే ఇప్పటి వరకు కరోనాకు వ్యాక్సిన్ కనుగొనలేదు. కేవలం మనం జాగ్రత్తలు తీసుకొని కరోనా భారిన పడకుండా కాపాడుకోవాలని డాక్టర్లు  సూచిస్తున్నారు.

 

ఇందుకోసం మాస్క్ తప్పని సరి ధరించాలి. బయటకు వెళ్తే ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయాలి. ఎక్కడికి వెళ్లినా తప్పని సరి శానిటైజర్ వాడాలని సూచిస్తున్నారు. కానీ కొంత మంది వీటిని అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా ఫ్రాన్స్‌లోని బయోన్నేలో మాస్కు లేకుండా నలుగురు వ్యక్తులు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న డ్రైవర్‌ను చితకబాది చంపేశారు.  కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఫ్రాన్స్‌ అంతటా మాస్కు తప్పనిసరి అక్కడి ప్రభుత్వం సూచించింది. ఆదివారం నలుగురు వ్యక్తులు మాస్కులు లేకుండా బస్సు ఎక్కడానికి ప్రయత్నించారు. అయితే 50 ఏండ్ల బస్సు డ్రైవర్‌ మాస్కు తప్పనిసరి అని, మాస్కు లేనిదే బస్సులోకి  అనుమతించమని వారిని అడ్డుకున్నాడు.

 

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తులు డైవర్‌పై విచక్షణారహితంగా దాడిచేశారు.  అతడి తలపై పదే పదే పిడిగుద్దులు గుద్దారు.. దాంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే స్థానికులు డ్రైవర్‌ను దవాఖానకు తరలించగా చికిత్స పోందుతూ బ్రెయిన్‌ డెడ్‌తో సోమవారం చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, దాడిచేసిన వారిలో ఒక వ్యక్తి తమ అదుపులో ఉన్నాడని, మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: