గ‌త కొద్దిరోజులుగా భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. మ‌న జ‌వాన్ల ప్రాణాలు కూడా చైనా స్వార్థానికి బ‌లిపెట్ట‌వ‌ల‌సి వ‌చ్చింది. అయితే, స‌రిహ‌ద్దు ఉద్రిక్త ప‌రిస్థితుల విష‌యంలో ఇవాళ ఓ కీల‌క పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాల సైన్యాలు వివాదాస్ప‌ద ప్రాంతం నుంచి వైదొలుగుతున్న‌ట్లు ఇవాళ‌ చైనా విదేశాంగ ప్ర‌తినిధి జావోలిజియాన్ తెలిపారు. స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు.. ఫ్రంట్‌లైన్ ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించ‌డానికి కావాల్సిన అన్ని చ‌ర్య‌ల‌ను చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అయితే, దీనికి ముందు కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది.  భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు అజిత్ ధోవ‌ల్‌.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో చ‌ర్చ‌లు జ‌రిపారు.

 

స‌రిహ‌ద్దు దేశాల విష‌యంలో ట్ర‌బుల్ షూట‌ర్ అనే పేరున్న భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు అజిత్ ధోవ‌ల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో వీడియో కాల్‌లో మాట్లాడారు. సంపూర్ణ స్థాయిలో శాంతి, సామ‌ర‌స్యం విల‌సిల్లాల‌న్న ల‌క్ష్యంతో స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించాల‌న్న భావ‌న‌తో చైనా విదేశాంగ మంత్రితో అజిత్ ధోవ‌ల్ మాట్లాడారు. భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ గాల్వ‌న్ లాంటి ఘ‌ర్ష‌ణ‌లు పున‌రావృత్తం కాకూడ‌ద‌ని భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు అజిత్ ధోవ‌ల్‌.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చ‌ర్చించుకున్న‌ట్లు స‌మాచారం. ల‌డ‌ఖ్‌లోని వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ఉద్రిక్త‌త‌లకు ఈ చ‌ర్చ‌లు ఫుల్ స్టాప్ పెట్టేలా సాగాయి. 

 

ఈ స‌మావేశాలు జ‌రిగిన కొద్ది గంట‌ల త‌ర్వాత‌ మూడ‌వ‌సారి జ‌రిగిన క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌ల్లో కుదిరిన ఒప్పందాల ప్ర‌కారం ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ జ‌రుగుతున్న‌ట్లు చైనా విదేశాంగ ప్ర‌తినిధి జావోలిజియాన్ తెలిపారు. ఫ్రంట్‌లైన్ ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ‌లో పురోగ‌తి సాధించిన‌ట్లు జావో లిజియాన్ తెలిపారు. దీంతో ఉద్రిక్త‌త‌ల‌ను కూడా త‌గ్గనున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఎల్ఏసీ నుంచి సుమారు రెండు కిలోమీట‌ర్ల మేర వెన‌క్కి చైనా ద‌ళాలు వెళ్లిన‌ట్లు భార‌త సైన్యం ప్ర‌క‌టించిన వెంట‌నే చైనా త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: