కులాల పేరుతో రాజకీయం చేయడం, తమకు అనుకూలంగా దానిని వాడుకొని లబ్ది పొందడం, రాజకీయాల్లో సర్వసాధారణం. ఈ మధ్యకాలంలో కులం అనేది ఎక్కువగా హైలెట్ అవుతోంది. సోషల్ మీడియాలో కుల జాడ్యం ఎక్కువైపోయింది. రాజకీయ నాయకులైన, సినిమా హీరోలు అయినా కులాన్ని బట్టి అభిమానులు ఉంటారు అన్నట్టుగా ప్రస్తుత సమాజంలో పరిస్థితి తయారైంది. రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కులాన్ని ఇష్టానుసారంగా వాడుతుండటంతో, వారిని అనుసరించేవారు కులాల వారిగా సమాజంలో విడిపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశమే కాదు, ప్రపంచమంతా కరోనా కష్టాలతో అల్లాడుతోంది. ఈ వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఉంది.
 
IHG
 
 
ఈ సమయం లో కరోనా వాక్సిన్ కోసం అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని కొన్ని సంస్థలు అప్పుడే వ్యాక్సిన్ తయారు చేసి, క్లినికల్ ట్రైల్స్ లో ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా కరోనా వ్యాక్సిన్ ప్రకటన రాగానే, సోషల్ మీడియాలో దానికి సంబంధించిన పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ కరోనా వాక్సిన్ తయారుచేసింది కమ్మ సామాజిక వర్గం వారేనని, మా మీద కక్షతో వ్యాక్సిన్ తీసుకోవడం మానేయకండి అంటూ , రెడ్డి సామాజిక వర్గం వారిని రెచ్చగొడుతున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కూడా అదే స్థాయిలో రిప్లై ఇస్తున్నారు. దేశ, విదేశాల్లోనూ బయో ఫార్మా కంపెనీలు అనేకం ఉన్నాయని సమాధానం ఇస్తున్నారు.
 
 
ప్రస్తుతం కరోనా నుంచి తప్పించుకోవడానికి వాక్సిన్ అవసరం కానీ, అది ఎవరు తయారు చేశారు ?  ఏ కులం వారు తయారు చేశారు ? ఏ ఊరిలో తయారు చేశారు అనేది అనవసరం. అయినా, సోషల్ మీడియాలో మాత్రం అర్థం పర్థంలేని కుల ప్రస్తావన తెచ్చి సమాజాన్ని మరింతగా కలుషితం చేస్తున్నారు.  సమాజంలో అన్ని వర్గాల వారు ఉంటారు. అన్ని రంగాల్లోనూ అన్ని కులాల వారు పైచేయి సాధిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని ఇప్పుడు తక్కువ అంచనా వేయలేని పరిస్థితి ఉంది. అయినా ఇప్పుడు ఈ కరోనా వీర విహారం చేస్తున్న ఈ సమయంలో కూడా విమర్శలు చేసుకోవడం చూస్తుంటే, ఈ సమాజం ఎటువైపు వెళుతుంది అనే ఆందోళన కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: