హైద‌రాబాద్‌లో క‌రోనా విస్తృతి కొన‌సాగుతోంది. శ్వాస సమస్య, జలుబు, జ్వరం, దగ్గుతో మొదలైన కరోనా లక్షణాలు కాలక్రమంగా రంగులు మారుస్తోంది. రూపాలు మార్చుకుంటూ.. కొత్త లక్షణాలు చూపుతోంది.  శ్వాస సమస్య, జలుబు, జ్వరం, దగ్గు,  రుచి, వాసన కోల్పోవడం, ఒంటి నొప్పులు తదితర సమస్యలతో పాటు  ఛాతినొప్పి, వాంతులు, వికారం, తిమ్మిర్లు పట్టడం వంటి లక్షణాలూ కనిపిస్తున్నాయి. వీటితో బాధపడుతున్న వారిలోనూ కరోనా పాజిటివ్‌ వస్తుందని స్ప‌ష్ట‌మ‌వుతోంది. 

 

కరోనా లక్షణాలు రోజుకో కొత్త రూపం దాల్చుతున్నాయి. తాజాగా మరికొన్ని లక్షణాలు కరోనా జాబితాలో చేర్చినట్లు వైద్యనిపుణులు స్పష్టం చేశారు. ఛాతిలో నొప్పి, వాంతులు, వికారం(వాంతి వచ్చిన ఫీలింగ్‌)తో పాటు కాళ్లు తిమ్మిర్లు పట్టడం, తలనొప్పి వంటివి కూడా కరోనా రోగుల్లో కనిపిస్తున్నట్లు వైద్యనిపుణులు వివరించారు.  ఇటీవల నిమ్స్‌ దవాఖానలోని కార్డియాలజి విభాగానికి గుండె సంబంధ వ్యాధులతో వచ్చిన రోగుల వల్ల సదరు విభాగానికి చెందిన సింహభాగం వైద్యసిబ్బంది కరోనా బారిన పడటం ఈ లక్షణాలకు మరింత బలం చేకూరుస్తున్నది.  గ్రేటర్‌లో కొంత మంది ఛాతినొప్పితో వస్తున్నవారిలో కరోనా పాజిటివ్‌ వస్తుందని నిమ్స్‌ పల్మనాలజి విభాగాధిపతి డా.పరంజ్యోతి తెలిపారు.

 

 

ఛాతినొప్పి, వాంతులు, వికారం కూడా కరోనా లక్షణంగా కనిపిస్తుందని నిమ్స్‌ పల్మనాలజి విభాగాధిపతి డా.పరంజ్యోతి వెల్ల‌డించారు. ఈ లక్షణాలు ఇటీవల కాలంలో చాలా మందిలో కనిపిస్తున్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కొత్త లక్షణాలు రావడానికి  వైరస్‌ పరివర్తనం చెందడం కారణమై ఉండవచ్చున‌ని విశ్లేషించారు. రోజులు గడుస్తున్న కొద్ది వైరస్‌ కొత్త కొత్త లక్షణాలను ప్రదర్శిస్తుందని ఆయ‌న పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా వల్ల ప్రాణహాని మాత్రం అతి తక్కువ అని మాత్రం చెప్పవచ్చునని వివ‌రించారు. తెలంగాణ రాష్ట్రంలో మరణాలు 2శాతంలోపే ఉన్నాయి. 87శాతం మంది లక్షణాలు లేకుండానే ఉంటూ సులువుగా ఇళ్ల‌ల్లోనే కోలుకుంటున్నారని వెల్ల‌డించారు. కేవలం 5నుంచి 10శాతం మంది మాత్రమే దవాఖానల్లో చేరాల్సిన పరిస్థితి వస్తున్నదని నిమ్స్‌ పల్మనాలజి విభాగాధిపతి డా.పరంజ్యోతి వివ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: