జగన్ సర్కారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఏకంగా 30 లక్షల మందికి ఈ ఇళ్ల పట్టాల మంజూరు ద్వారా లబ్ది కలగబోతోంది. ఇది నిజంగా బృహత్తర కార్యక్రమమే.. అయితే సహజంగానే ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ఈ కార్యక్రమంపై విమర్శలు గుప్పించింది. అడ్డగోలుగా లబ్దిదారుల జాబితాలు రూపొందించారని ఆరోపించింది. అంతే కాదు.. ఈ ప్రక్రియ న్యాయబద్దంగా జరగడం లేదని హైకోర్టు గుమ్మం తొక్కింది. 

 


అయితే.. ఇది వైసీపీ నాయకులకు చాలా ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకే ఇళ్ల స్థలాల పక్రియకు టీడీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కాకుండా సైంధవ పాత్ర పోషిస్తున్నారని మండిపడుతున్నారు. ఇళ్ల స్థలాల కోసం 60 వేల ఎకరాలు సిద్దం చేశామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు తెలిపారు. మొత్తం 30 లక్షల మంది పేద కుటుంబాలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారన్నారు.

 


దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేస్తారన్న పద్దతిలో చంద్రబాబు, ఆయన మనుషులు ఈ కార్యక్రమాన్ని పదేపదే అడ్డుకుంటున్నారని మంత్రి విమర్శించారు. అయితే ఈ విమర్శలతో తెలుగు దేశం పార్టీ కూడా కాస్త భయపడుతోంది. అసలే పేదల కార్యక్రమం.. దాన్ని అడ్డుకున్నామన్న చెడ్డపేరు ప్రజల్లోకి వెళ్తోందని చివరకు గ్రహించారు. 

 


అందుకే నేరుగా చంద్రబాబు రంగంలోకి వచ్చారు. ఇళ్ల స్థలాల ప్రక్రియకు తాము వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చుకున్నారు. ఈ ప్రక్రియలో అవినీతికే తాము వ్యతిరేకం తప్ప.. స్థలాల పంపకానికి కాదని పదే పదే చెప్పుకొచ్చారు. మొత్తానికి చంద్రబాబు మాటలు చూస్తుంటే..  తెలుగుదేశాన్ని ప్రజాగ్రహం నుంచి బయట పడేసేందుకు నానా తంటాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. మరి ప్రజల్లో వ్యతిరేకత వస్తే అసలుకే మోసం వస్తుంది కదా..!

మరింత సమాచారం తెలుసుకోండి: