తెలంగాణ‌లో ప్ర‌స్తుత‌మున్న స‌చివాల‌యం కూల్చివేత‌పై ఇప్పుడు అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్‌ను ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇలాంటి త‌రుణంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు, మంత్రి హ‌రీశ్‌ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వందేళ్ల జీవిత‌కాలం ఉన్న సచివాలయ భవనాలను కూల్చివేయడం దారుణమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్ల తర్వాత కూడా హైదరాబాద్‌పై ఏపీ ప్రభుత్వానికి పెత్తనం ఉండాలని భావిస్తున్నారా?’ అని ఉత్తమ్ వ్యాఖ్యలకు మంత్రి హరీశ్‌రావు కౌంట‌ర్ ఇచ్చారు. 

 

 

ఏపీ ప్రభుత్వం స్వచ్ఛందంగా, అధికారికంగా హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌తోపాటు అన్ని ప్రభుత్వ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిందని మంత్రి హ‌రీశ్ రావు గుర్తు చేశారు. దీంతో సెక్షన్‌-8 అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ‘ఏపీ సీఎంల దగ్గర పనిచేసిన మీరు ఇంకా అదే మనస్తత్వంతో కొనసాగుతున్నట్టు కనబడుతున్నది’ అంటూ ఫైర్‌ అయ్యారు.

 


 

కాగా, కాంగ్రెస్‌ నాయకులది బానిస మనస్తత్వమని, బానిస బతుకులు బతికారని, బీ ఫాం, మంత్రి పదవుల కోసం ఆంధ్ర నాయకత్వం మోచేతి నీళ్లు తాగారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. అదే అలవాటై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు కుక్కబుద్ధి ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుక్క తనకు అన్నం దొరుకకుంటే కుండలో మూతిపెట్టి దానిని పగుల గొడుతుందని, కాంగ్రెస్‌ నాయకుల వైఖరి కూడా అదేవిధంగా ఉన్నదని, తమకు అధికారం లేదు కాబట్టి తిరిగి ఉమ్మడి రాష్ట్రంగా మారుద్దామనేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సెక్షన్‌-8 అమలుచేయాలని కోరుతున్న వారి అజ్ఞానం, మూర్ఖత్వం చూసి ఏమనాలో అర్థం కావడంలేదన్నారు. ఉత్తమ్‌ రాజీనామా చేసిన హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌కు 40 వేలకు పైగా మెజారిటీ వచ్చిందన్నారు. ఉత్తమ్‌ పీసీసీ అధ్యక్షుడిగా పనికిరాడని ఆ పార్టీ నాయకులే అంటున్నారని పేర్కొన్నారు. ఇంత దరిద్రపు ప్రతిపక్షం దేశంలో ఎక్కడా లేదని మండిప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: