దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ అతన్ని స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా అతని రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగిందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభలో ఎంట్రీ ఇచ్చిన పులిబిడ్డ వైయస్సార్ మొత్తం 6 సార్లు ఎంపిక కాగా 4 సార్లు కడప నియోజకవర్గం నుండి పార్లమెంట్ లో అరంగేట్రం చేశారు. రాజశేఖర్ రెడ్డి పోటీ చేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి జనతాపార్టీ పోటీకి ఎదురొడ్డి మంత్రి పదవిని అవలీలగా సంపాదించారు. తదనంతరం రాష్ట్రంలో మూడు సార్లు ముఖ్యమంత్రులు మారినప్పటికీ అతను మాత్రం ఆ మూడు మంత్రి మండలిలోనూ నిర్విరామంగా మంత్రి పదవిలో కొనసాగి అందరినీ ఆశ్చర్య పరిచారు.


కాలక్రమేనా అతనికి ప్రభుత్వరంగంలో ఎటువంటి పదవులు దక్కకపోవడం అతన్ని కాస్తా బాధించిందని చెప్పుకోవచ్చు. 1989, 1994 సంవత్సరాల మధ్యలో ముఖ్యమంత్రి అవ్వాలనే తపనతో ఎంతో శ్రమపడి యత్నించినప్పటికీ దానికి అవకాశం మాత్రం అందనంత ఎత్తులో ఉండిపోయింది. అయితే 1999వ సంవత్సరంలో మళ్లీ శాసనసభకు ఎంపికైన వైయస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా దూసుకెళ్తూ  కాంగ్రెస్ పార్టీని ఎంతగానో అభివృద్ధి చేసి వచ్చే ఎన్నికలలో అధికార పక్షంపై గెలిచేందుకు రాజకీయ వ్యూహం రచించి గొప్ప రాజకీయ నాయకుడిగా వెలుగొందారు.


2003వ సంవత్సరంలో ఎర్రటి ఎండలో 1467 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన పులివెందుల పులి బిడ్డ రాజశేఖర్ రెడ్డి... ఉచిత విద్యుత్ అందిస్తామని తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ప్రచారం చేస్తూ తెలుగు ప్రజలను ఎంతగానో ఆకర్షించారు. ఈ మండువేసవిలో చేసిన పాదయాత్ర అతని విజయానికి పూల బాట వేసింది అని చెప్పుకోవచ్చు. 2004వ సంవత్సరంలో పులివెందుల నియోజకవర్గం నుండి నలభై వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందిన వైయస్ రాజశేఖర్ రెడ్డి కి... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మెజారిటీ సంపాదించడం తో సీఎం పీఠం కాళ్ళ ముందు వచ్చి పడింది. ఆ తర్వాత తన పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: