కాలంతో పాటు వందల మంది నాయకులు ప్రయాణిస్తుంటారు.. ఆ తర్వాత కాలగర్భంలో కలసిపోతారు. కానీ చరిత్ర మాత్రం కొందరినే గుర్తు పెట్టుకుంది. కొందరినే తనలో లిఖించుకుంటుంది. అలాంటి అరుదైన నాయకులలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎందరో ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ.. చరిత్రలో ఒక ఎన్టీఆర్.. ఒక వైఎస్సార్ వంటి అతి కొద్ది మంది మాత్రమే తమ ప్రత్యేకత నిలబెట్టుకున్నారు. 


వైఎస్సార్‌ ఎందుకు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.. ఎందుకంటే ఆయన పేదల పక్షాన నిలిచారు. పేదల కష్టాలు అర్థం చేసుకున్నారు.. పేదల కన్నీరు తుడిచారు. పేదలే కేంద్రంగా తన పాలన సాగించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి ఆదుకున్నా.. పేద విద్యార్థుల చదువుల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం తెచ్చినా.. ఆయన లక్ష్యం పేదవాడే.. పేదవాడి తలరాత మార్చడమే ఆయన రాజకీయానికి ప్రథమ కర్తవ్యంగా ఉండేది. 


స్వతహాగా వైద్యుడైన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. పేదవాడి ఆరోగ్యమే కాదు.. ఆర్థిక కష్టాలకూ వైద్యం చేయాలనుకున్నారు. అందుకే ఇన్ని పథకాలు ఆయన మస్తిష్కం నుంచి పుట్టుకొచ్చాయి. పేదవాడికి ఆరోగ్యం భారం కాకూడదనే ఆరోగ్య శ్రీ తీసుకొచ్చారు. అంతకు ముందు.. కార్పొరేట్ ఆసుపత్రి గుమ్మం తొక్కేందుకు కూడా సాహసించని అనేక మంది అభాగ్యులు వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీతో దర్జాగా వైద్యం చేయించుకున్నారు. 


కళ్ల ముందే అయినవాళ్లు ప్రాణాలొదులుతున్నా.. గుడ్లనీరు కుక్కుకుని రోదించడం మినహా ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలు.. ఆరోగ్యశ్రీ పుణ్యమా అని పునర్జన్మ పొందారు. ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఆయన.. ఆ పేదల పూజ గదిలో చేరారు.. దేవుడి ఫోటోల పక్కన స్థానం పొందారు.  వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలే ప్రజల గుండెల్లో ఆయన్ను చిరస్మరణీయుణ్ని చేశాయి. వైఎస్ సంక్షేమ రాజకీయాలకు కొత్త ఊపిరిపోశారు. అందుకే వైఎస్‌ జననేత అయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: