అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారి డ్రాగ‌న్ కంట్రీ చైనాపై విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో వాణిజ్య సంబంధ‌మైన ఆంక్ష‌లు, ఒప్పందాల విష‌యంలో చైనాపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు కరోనా మ‌హమ్మారి విష‌యంలో అయితే ట్రంప్ చైనాపై దుమ్మెత్తిపోస్తున్నారు. క‌రోనా విషయాన్ని దాచిపెట్టిన చైనా.. అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్ని తీవ్ర నష్టానికి గురిచేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తాజాగా విరుచుకు పడ్డారు. వైరస్‌ అంశాన్ని రహస్యంగా ఉంచుతూ, తన మోసపూరిత చర్యలను కప్పిపుచ్చుకునేందుకు చైనా ప్రయత్నించడం వల్లే మహమ్మారి 189 దేశాలకు వ్యాపించిందని ఆరోపించారు. ఇందుకు చైనా తప్పక మూల్యం చెల్లిస్తుందన్నారు. అయితే, ఈ రేంజ్‌లో కామెంట్లు చేస్తున్న ట్రంప్ తెర‌వెనుక చైనాకు స‌హాయం చేస్తున్నారా? అనే సందేహం తాజాగా అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

 


అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ, క‌రోనా వైరస్‌ విలయానికి మూల కారణం చైనాయేనని మండిపడ్డారు. కరోనా విషయంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతీ రోజూ నోటికి పని చెబుతూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో.. అమెరికా ట్రెజరీ విభాగం, స్మాల్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎస్‌బీఏ) ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ (ఈవీ) స్టార్టప్స్‌ విషయంలో అమెరికా నుంచి చైనా 5 మిలియన్‌ డాలర్లు.. పేచెక్‌ ప్రొటెక్షన్‌ లోన్‌ రూపంలో తీసుకున్నట్టు తెలి పింది. బైటాన్‌, నియో, కర్మ ఆటోమోటివ్‌తో పాటు పలు కంపెనీలు ఈ రుణాన్ని పొందినట్టు వివరించింది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక పరిస్థితి జఠిలంగా మారిన నేపథ్యంలో ఈ రుణం పొందినట్టు సమాచారం. 

 

చైనాకు చెందిన ఈవీ స్టార్టప్స్‌ కంపెనీలు పెద్ద మొత్తంలో రుణాలు పొందినట్టు ఎస్‌బీఏ తెలిపిందని ‘ది వర్జ్‌ ‘ రిపోర్టు వెల్ల‌డించింది.  చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని తొలి ఆటో వర్క్స్‌ మద్దతు ఉన్న బైటాన్‌.. తమకు ఇచ్చే రుణం.. ఉద్యోగాల కోతను నివారించడంలో ఉపయోగపడుతుందని దరఖాస్తులో పేర్కొంది. అలా రుణం పొందిన ఆ కంపెనీ గతవారం ఉత్తర అమెరికా ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. నియో ఈవీ స్టార్టప్‌ కంపెనీ కూడా దరఖాస్తులో ఇదే కారణం చెప్పింది. ఉద్యోగులను తొలగించకుండా ఉండేందుకు రుణం అవసరమని తెలిపింది. ఇప్పటికే ఈ స్టార్టప్‌ కంపెనీ 1 మిలియన్‌ డాలర్లను పెట్టుబడిని చైనా నుంచి పొందింది. అయినా ఈ పెట్టుబడి.. ఉత్పత్తి కోసమని చెప్పుకొచ్చింది. అయితే, చైనాపై నిప్పులు క‌క్కుతున్న ట్రంప్ ఈ మేర‌కు క‌ఠినంగా ఆంక్ష‌లు ఎందుకు విధించ‌డం లేద‌నే అనుమానాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: