అన్‌లాక్ నిబంధ‌న‌లు తెర‌మీద‌కు రావ‌డంతో సుదీర్ఘ‌కాలం త‌ర్వాత ప్ర‌జ‌లంతా ఫంక్ష‌న్ల‌ కోసం ప్ర‌ణాళిక‌లు చేసుకుంటున్నారు. ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌లో జ‌నాలు వివిధ ర‌కాలైన ఫంక్ష‌న్ల సంద‌డిలో మునిగి తేలుతున్నారు. ఇలాంటి త‌రుణంలో పోలీసుల నుంచి కీల‌క‌మైన హెచ్చ‌రిక వ‌చ్చింది. కొవిడ్‌-19 నిబంధనలను అందరూ పాటించాలని.. ఎవరైనా పాటించకపోతే వారిపై కఠిన చర్యలు తప్పవని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ హెచ్చరించారు. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా శుభకార్యాలకు 50 మందికే అనుమతి ఉంటుందని  అంతకన్నా ఒక్కరు ఎక్కువ ఉన్నా కేసు నమోదు చేస్తామని రాచ‌కొండ సీపీ తేల్చిచెప్పారు.

 

ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వివాహా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించుకోవాల‌ని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్ స్ప‌ష్టం చేశారు. వివాహ సమయంలో 50 మంది కంటే ఎక్కువ ఉం టే వారిపై కేసులు నమోదు చేస్తామని.. ఇప్పటికే 51 మంది ఉన్నవారిపై కూడా కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు.  ప్రతి ఒక్కరూ మాస్కులు, భౌతిక దూరం పాటించాలని సీపీ సూచించారు. రాచకొండ పరిధిలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి వాటిపై సోమవారం నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాస్కు ధరించనివారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని సీపీ ప్ర‌క‌టించారు. అలాగే భౌతిక దూరం పాటించకుండా వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  

 

 

భౌతిక దూరం పాటించకుండా వ్యాపారాలను నిర్వహించినా, కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి బయట తిరిగినా... వారిపై రాచకొండ వాట్సాప్‌ నెం.9490617111కు లేదా డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్ సూచించారు. నిబంధనలు పాటించని కుషాయిగూడ డీమార్ట్‌పై చర్యలు తీసుకున్నామని సీపీ వివరించారు.  మాస్కులు ధరించని 3 వేల మందికి జరిమానాలు విధించడంతో పాటు వారిపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని రాచకొండ సీపీ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: