ఇది సుప్రీం రైలు. పరుగులు పెట్టేటప్పుడు భూకంపాలు వచ్చినా పసిగట్టేస్తుంది. ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి చేరుస్తుంది. నవ్యావిష్కరణలకు చిరునామా అయిన జపాన్‌ ఈ సరికొత్త బుల్లెట్‌ రైలును ఇటీవల పట్టాలపైకి ఎక్కించింది. టొకైడో మార్గంలో తాజాగా దూసుకెళ్లిన ఈ రైలులో చాలా ప్రత్యేకతలున్నాయి.

 

సమయపాలనకు పెట్టింది పేరైన జపాన్‌ ఈ రైలు విషయంలోనూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఈ ఏడాది జపాన్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించాల్సి ఉండగా అదే సమయంలో ఈ రైలును పరుగులుపెట్టించాలనుకుని లక్ష్యంగా విధించుకుని సిద్ధం చేసింది. అయితే కరోనా కారణంగా ఒలింపిక్స్‌ 2021కు వాయిదా పడింది. రైలు మాత్రం వాయిదా పడలేదు.
 గరిష్ఠ వేగం గంటకు 360 కిలోమీటర్లు.
వాస్తవ వేగం గంటకు 285 కిలోమీటర్లు.

 

రైలులో అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత భద్రతే. షింకన్‌సేన్‌ నెట్‌వర్క్‌ మొత్తాన్ని ఇప్పటికే భూకంపాన్ని గుర్తించే సెన్సార్లకు అనుసంధానించారు. ఎక్కడైనా భూకంపం వస్తే ఈ మార్గంలోని రైళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయి అత్యవసర బ్రేకులు వాటంతటవే పడి రైళ్లు ఆగిపోతాయి. ఎన్‌700ఎస్‌లో మరో ప్రత్యేక భద్రతా ఏర్పాటును జోడించారు. లిథియం-అయాన్‌ బ్యాటరీతో కూడిన స్వీయ-ప్రొపల్షన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ఈ తరహా ఏర్పాటు మొదటిది. భూకంపాలు వంటివి సంభవించి విద్యుత్‌ సరఫరా ఆగిపోయి వంతెన లేదా సొరంగం వంటి చోట్ల ఇరుక్కుపోతే దగ్గర్లోని సురక్షిత ప్రాంతానికి రైలు వెళ్లడానికి ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది. మరింత అధునాతన స్వయంచాలిత నియంత్రణ-బ్రేకింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో అత్యవసర పరిస్థితుల్లో చాలా వేగంగా రైలు ఆగిపోతుంది.

 

దిగాల్సిన స్టేషన్‌ వచ్చినప్పుడు తమ వస్తువులు తీసుకోకుండా మర్చిపోవడం చాలా మందికి అనుభవమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. సీట్లవరుసకు పైభాగంలో లగేజి పెట్టుకునే చోట ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి స్టాప్‌లోనూ ఈ అరలకు అమర్చిన లైట్లు వెలుగుతాయి. దీంతో ప్రయాణికులకు లగేజి తీసుకోవాలని గుర్తుంటుంది.మరింత అధునాతన సస్పెన్షన్‌ వ్యవస్థతో కుదుపులు లేని విధంగా తీర్చిదిద్దారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: