నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిపై రాజీనామా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో చైనా ఆ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోంది. అధికార పార్టీ నేతలతో మంతనాలు జరుపుతోంది.ఈ మేరకు ఓలిని గట్టెక్కించడానికి చైనా రాయబారి హౌ యాంకీ నేపాల్ కమ్యునిస్టు పార్టీ నేతలతో చర్చలు ముమ్మరం చేశారు. మాజీ ప్రధానులు మాధవ్ కుమార్ నేపాల్, జలనాథ్ ఖనాల్ సహా గత 48 గంటల్లో పలువురు సీనియర్ నేతలను కలిశారు. మాధవ్ కుమార్, జలనాథ్​లు​ చైనా రాయబారితో సమావేశమైన విషయాన్ని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.

 

 

ఖనాల్​తో గురువారం 45 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో.. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలపై హౌ ఆందోళన వ్యక్తం చేశారు. విభేధాలను పరిష్కరించుకునే దిశగా పనిచేయాలని సూచించారు. ఎన్​సీపీ నేత, మాజీ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్​తో ఆదివారం సమావేశమయ్యారు హౌ. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. ఆమెను అదేరోజు నేపాల్​ అధ్యక్షురాలు విద్యా దేవీ భండారీ సైతం ఆహ్వానించారు.అధికారం కోసం పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ' నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి, ప్రధాని ఓలికి మధ్య అంతర్గతంగా అభిప్రాయభేదాలు పెరిగిపోయిన సమయంలో చైనా ఈ తరహా చర్చలు సాగించడం ఆసక్తికరంగా మారింది.

 

 

బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రధాని ఓలి, ప్రచండతో చర్చల్లో పాల్గొన్నారు. ప్రధాని నివాసంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ఇరువురి మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాలకు పరిష్కారం దిశగా సమాలోచనలు జరిపారు. అయితే పరిష్కారం విషయంలో ఎలాంటి పురోగతి లభించలేదని ప్రధాని ఓలి ప్రెస్ అడ్వైజర్ సూర్య థాపా వెల్లడించారు.ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశాలు ప్రధాని ఓలి సహా ఎన్​సీపీకి కీలకం కానున్నాయి. ఓలి, ప్రచండ మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ఇప్పటివరకు మూడుసార్లు వాయిదాపడ్డాయి. వీరిద్దరు తమ డిమాండ్ల విషయంలో వెనక్కితగ్గకపోవడం వల్ల చర్చలు అపరిష్కృతంగానే మారాయి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: