సరిహద్దులో భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. ఇరు దేశాల బలగాలు గల్వాన్​ లోయలోని పెట్రోలింగ్ పాయింట్-15 నుంచి 1.5కి.మీ మేర వెనక్కి వెళ్లాయి. ఇతర ప్రాంతాల్లోనూ ఈ ప్రక్రియ పూర్తయ్యాక మరోసారి చర్చలు జరుపనున్నాయి రెండు దేశాలు.తూర్పు లద్దాఖ్​లో భారత్​-చైనా బలగాల మధ్య ఉద్రిక్త వాతావరణం తగ్గుముఖం పట్టింది. ఇరు దేశాల మధ్య 3 సార్లు జరిగిన సైనిక కమాండర్ స్థాయి చర్చలు, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ రంగప్రవేశంతో సరిహద్దులో రాజుకున్న వేడి చల్లారింది. పరస్పర అంగీకారం మేరకు గల్వాన్​ లోయలోని పెట్రోలింగ్​ పాయింట్​-15 నుంచి రెండు దేశాలు బలగాలను ఉపసంహరించుకున్నాయి. చైనా సైనికులు దాదాపు 2 కి.మీ మేర వెనక్కి వెళ్లిన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత బలగాలు కూడా 1.5కి.మీ మేర వెనక్కి వచ్చినట్లు పేర్కొన్నాయి.

 

 

తూర్పు లద్దాఖ్​లో భారత్​-చైనా సైనికులు ఘర్షణ పడ్డ హాట్​ స్ప్రింగ్స్​ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలను చైనా కూల్చివేసుకున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సరిహద్దులో మిగతా ప్రాంతాల్లోనూ బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇరు దేశాలు మరోసారి చర్చలు జరుపుతాయని స్పష్టం చేశాయి.సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాలు చేపట్టాల్సిన చర్యలపై చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్​ యీతో ఆదివారం రెండు గంటలపాటు ఫోన్​లో సంభాషించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​. ఆ మరునాటి నుంచే ఇరు దేశాలు బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించాయి. రెండు దేశాల మధ్య కుదిరిన పరస్పర అంగీకారం మేరకు గల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, గొగ్రా, ఫింగర్ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలి.ప్రస్తుతం హాట్​స్ప్రింగ్స్​ పెట్రోలింగ్​ పాయింట్​-15 నుంచి రెండు దేశాల బలగాల ఉపసంహరణ పూర్తయింది. కొద్ది రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా ఈ ప్రక్రియ పూర్తవుతుంది.పరస్పర అంగీకారం మేరకు బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిందా లేదా అనే విషయాన్ని నిర్ధరించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు తూర్పు లద్దాఖ్​ సరిహద్దు ప్రాంతాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత మళ్లీ చర్చలు జరిపి సరిహద్దులో మునుపటిలా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కృషి చేస్తారని సైనిక వర్గాలు చెప్పాయి. గొగ్రాలోని పెట్రోలింగ్ పాయింట్​-17 నుంచి రెండు దేశాలు బలగాలను గురువారం ఉపసంహరించుకుంటాయని పేర్కొన్నాయి. ఈ వారాంతంలోనే మరోసారి చర్చలు జరిగే అవకాశాలున్నాయని తెలిపాయి.గల్వాన్ ​లోయలో ఘర్షణ జరిగిన పెట్రోలింగ్ పాయింట్​-14 నుంచి చైనా ఇప్పటికే బలగాలను ఉపసంహరించుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: