విజయవాడ స్వరాజ్‌ మైదాన్‌లో 125 అడుగుల డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ శంకుస్థాపన చేశారు. క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...‘అంబేద్కర్‌ గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే అన్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అంబేద్కర్‌ను గౌరవిస్తూ, ఎలాంటి చోట అంబేద్కర్‌ విగ్రహం ఉండాలని ఆలోచన చేస్తూ, నిజంగా ఏడెకరాల స్థలం విజయవాడ నడిబొడ్డులో ఉంది, అక్కడొక మంచి పార్కు వస్తే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, పార్కులో నలుగురు కూర్చోవచ్చు, ఆ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు, అన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడుతుంది, అలాంటి చోట అంబేద్కర్‌ విగ్రహం అక్కడే ఉంటే.. ఆయన చేసిన మంచి ఎప్పటికీ కూడా అందరికీ గుర్తు ఉంటుందనే ఉద్దేశంతో, విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో చూడదగ్గ ప్రదేశంగా ఇది తయారవుతుందని భావిస్తూ, మనస్ఫూర్తిగా భావిస్తూ.... ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’ అన్నారు.

 

దేశంలో ఎక్కడాలేని రీతిలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని, 20 ఎకరాల్లో పార్కు నిర్మాణం బాగా జరిగేలా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని.... సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌ను సీఎం ఆదేశించారు. విశ్వరూప్‌ తన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి విగ్రహ నిర్మాణ ప్రాంతం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 

 

కాగా, శంకుస్థాపన ముగిసిన తర్వాత తనతో ఉన్న మంత్రులు, అధికారులతో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలను 100 ఏళ్లు ప్రభావితం చేస్తున్న మహాశక్తి బాబా సాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్ అని సీఎం వ్యాఖ్యానించారు. చదువుల్లో దీపం, మేథావుల్లో శిఖరం అంబేద్కర్‌ అని, అప్పట్లో దేశంలో ఎవ్వరూ చదువుకోనంత గొప్పగా చదువుకున్న విద్యాధికుల్లో అంబేద్కర్‌ ఒకరంటే....ఆయన సంకల్పం, శ్రమ, తపస్సు, ఎంత గొప్పదో ఎవరైనా అర్థం చేసుకోవచ్చన్నారు. ఇంగ్లిషు విద్య అవసరాన్ని తన విద్యా జీవితం ద్వారా అంబేద్కర్‌ చాటి చెప్పారని ముఖ్యమంత్రి అన్నారు. అంబేద్కర్‌ విగ్రహం, ఫొటో ఏ మారుమూల గ్రామంలో ఉన్న పేదలకైనా, ఒక ధైర్యం, ఒక రక్షణ కవచం, ఆ విగ్రహమే ఒక భరోసా అని సీఎం వ్యాఖ్యానించారు. క్యాంపు కార్యాయలం నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు మోపిదేవి, కన్నబాబు, సీఎస్‌ నీలంసాహ్ని ఈ కార్యక్రమంలో పాల్గొనగా, విగ్రహ నిర్మాణ స్థలం నుంచి మంత్రులు మేకతోటి సుచరిత, విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్నినాని, ఎమ్మెల్యేలు మేకా ప్రతాప్‌ అప్పారావు, ఉండవల్లి శ్రీదేవి, మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణం, పార్కు అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రభుత్వం జులై 7న కీలక జీవో జారీచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: