తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ వరుసగా విమర్శలు ఎదుర్కొంటూ వస్తోంది. గతం కంటే ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయంగా యాక్టివ్ కావడంతో పాటు, టీఆర్ఎస్ పై ఎదురుదాడి మొదలుపెట్టింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రతి అంశంలోనూ, తల దూరుస్తూ, అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారారు. కరోనా విషయంలో గాని, తెలంగాణలో కూల్చివేతకు గురవుతున్న పాత సెక్రటరీ కూల్చివేత విషయంలో కాని, ఆయన చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆయన లేవనెత్తిన అంశం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అలాగే పాత సెక్రటరీ బిల్డింగ్ కూల్చేందుకు గవర్నర్ అనుమతి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందా లేదా అనే ప్రశ్నలతో కాంగ్రెస్ నాయకులు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని.

 

హైదరాబాద్ కు సంబంధించిన అంశాల్లో గవర్నర్ కు విశేష అధికారాలు కల్పిస్తూ విభజన చట్టంలోని సెక్షన్ 8 ను చేర్చారు. ఈ అధికారాలను గతంలో గవర్నర్ నరసింహన్ వాడుకునే ప్రయత్నం చేసినా, కెసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి తమకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకునే వారు. ఆ తరువాత చంద్రబాబు అమరావతికి తరలివెళ్లిపోవడంతో సెక్షన్ 8 అనే విషయం పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది. తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు సెక్షన్ 8 అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. ఈ సెక్షన్ ప్రకారం సచివాలయాన్ని ఖాళీ చేయాలంటే తప్పనిసరిగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. తెలంగాణ వాటాగా వచ్చిన భవనాలను కూల్చివేత విషయంలో ఈ అనుమతి అవసరం లేదు. కానీ ఏపీ ప్రభుత్వం వాటాగా వచ్చిన భవనాల కూల్చివేత కు తప్పనిసరిగా గవర్నర్ అనుమతి ఉండాల్సిందే.

 

దీనికి కారణం పదేళ్లపాటు ఆ భవనాలపై ఏపీకి హక్కు ఉంటుంది. కాకపోతే ఏపీ ఆస్తులను తెలంగాణకు అప్పగించడం, రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం అనుకున్నా, విభజన చట్టం ప్రకారం చూసుకుంటే ఉమ్మడి రాజధానిలో ఏపీకి కేటాయించిన భవనాలు మాత్రం పదేళ్లపాటు ఏపీకే చెందుతాయి. ఈ విషయాన్ని కనిపెట్టే కాంగ్రెస్ నాయకులు సెక్షన్ 8 అంశాన్ని తెరమీదకు తీసుకు వచ్చి టీఆర్ఎస్ పై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై టిఆర్ఎస్ శ్రేణులు కూడా గట్టిగానే సమాధానం ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భవనాలు పూర్తిగా తమకు అప్పగించిన తర్వాత దాని ప్రస్తావన రాదని, తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు సమాధానం ఇచ్చారు. అయినా, కాంగ్రెస్ నాయకులు సెక్షన్ 8 అనే అంశాన్ని వదిలిపెట్టకుండా టిఆర్ఎస్ ఎదురుదాడి చేస్తూ రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలనే విధంగా ముందుకు వెళ్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: