తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,924 కరోనా కేసులు నమోదు కాగా వీటిలో 1,590 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 29,536కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 11 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. 
 
అయితే కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ప్రాథమిక కేంద్రాల ద్వారా ర్యాపిడ్ యాంటిజెన్ కోవిడ్ 19 పరీక్షలను ప్రారంభించింది. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 మందికి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 50 అర్బన్ హెల్త్ సెంటర్లు, రంగారెడ్డిలో 20, మేడ్చల్ లో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
పరీక్షలు నిర్వహించిన అరగంటలోపే ఫలితం వెలువడనుంది. మొదట కరోనా లక్షణాలు ఉన్నవారికి, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి స్వాబ్ (ముక్కు, గొంతు స్రావాలు) సేకరిస్తారు. ప్రత్యేక కిట్ సహాయంతో చేసే పరీక్షల్లో 30 నిమిషాల్లోనే ఫలితం వెలువడుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన పరీక్షలన్నీ ఆర్టీ పీసీఆర్ విధానంలో మాత్రమే జరిగాయి. అయితే పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేయాలని భావిస్తోంది. 
 
ర్యాపిడ్ యాంటిజెన్ విధానంలో పాజిటివ్ వస్తే కరోనా నిర్ధారణ అయినట్లే. అయితే కరోనా నెగిటివ్ వస్తే మాత్రం ఆర్టి పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. నిన్న జరిపిన ర్యాపిడ్ పరీక్షల ఫలితాలను అధికారులు ఇంకా వెల్లడించలేదని తెలుస్తోంది. తక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో కరోనా లక్షణాలు ఉన్నవారికే అధికారులు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం.       

మరింత సమాచారం తెలుసుకోండి: