దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి తారాస్థాయికి చేరింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం కేసుల సంఖ్య 3,000కు అటూఇటుగా ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులభంగానే అర్థమవుతుంది. 
 
అయితే భారత్ లో కరోనా వృద్ధిరేటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను... అధికారులను మరింత టెన్షన్ పెడుతోంది. గత వారం రోజుల్లో రోజుకు సగటున అమెరికాలో 1.8%, బ్రెజిల్ లో 2.7%, పెరూలో 1.2%, రష్యాలో 1% వృద్ధి రేటు నమోదు కాగా భారత్ లో మాత్రం ఏకంగా 3.5% వృద్ది రేటు నమోదైంది. దేశంలో ఒక వ్యక్తి ద్వారా 1.14 మందికి వైరస్ వ్యాప్తి చెందుతుందని పరిశోధనల్లో తేలింది. దేశంలో మంగళవారం - బుధవారం మధ్యలో 22,752 కొత్త కేసులు నమోదయ్యాయి. 16,883 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 
గతంతో పోలిస్తే మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండగా ఢిల్లీలో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతోంది. కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా అడ్డూఅదుపూ లేకుండా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దేశంలో కరోనా మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించడం సాధ్యమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 
 
వ్యాక్సిన్ కోసం పలు దేశాల శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు మానవులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయి ఫలితాలు వెలువడటానికి చాలా నెలలే పట్టే అవకాశం ఉంది. భారత్ లో కూడా పలు వ్యాక్సిన్ లు క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి. శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు వైరస్ ను త్వరలో నియంత్రించడం సాధ్యమేనన్న నమ్మకాన్ని ప్రజల్లో పెంచుతున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: