దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. అన్ లాక్ 1.0, అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత ఇరు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ ను అదుపులోకి తీసుకురావడం సాధ్యం కావడం లేదు. మరోవైపు ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య చెక్ పోస్టుల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో కేసులు పెరుగుతూ ఉండటం, లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. 
 
దీంతో తెలంగాణ సరిహద్దులో ఉండే ఏపీ చెక్ పోస్టుల దగ్గర ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటం అటు పోలీసులకు, ఇటు వాహనదారులకు ఇబ్బందిగా మారింది. వాహనదారులు పాస్ లను పొంది సొంతూళ్లకు పయనమవుతున్నారు. అధికారులు పాస్ లను పరిశీలించి స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించి లక్షణాలు కనిపించిన వాళ్లను ఆస్పత్రికి, అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలను పంపుతున్నారు. 
 
అయితే తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలలో పలు వాహనాలు ఈ పాస్ లు లేకుండా వెళుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. రోజూ దాదాపు 300 నుంచి 400 వాహనాలు పాస్ లు లేకుండా వెళుతున్నాయని తెలుస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ నుంచి వచ్చేవారిలో లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా కోవిడ్ కమాండ్ సెంటర్ వద్ద పరీక్షలు నిర్వహించాలని అధికారులు చెబుతున్నారు. 
 
అయితే అధికారులు నాగార్జునసాగర్‌ వైపు నుంచి వాహనాలు అనుమతించకూడదని ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలు ఎందుకిచ్చారనే విషయం తెలియదు కానీ సాగర్‌కు రాగానే పోలీసులు పాసులు ఉన్నప్పటికీ వాహనాలను నిలిపివేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ మార్గం ద్వారా ప్రజలను అనుమతించడం లేదని వాళ్లు చెబుతున్నారు. దీంతో ఆ మార్గం గుండా వచ్చిన ప్రయాణికులు నిరాశతో వెనక్కు వెళుతున్నారు.               

మరింత సమాచారం తెలుసుకోండి: