దేశంలో ఎక్కడ చూసినా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పట్లో వైరస్ ను నియంత్రించడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో కుటుంబాలకు కుటుంబాలు వైరస్ భారీన పడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ ను నియంత్రించటం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే వైరస్ భారీన పడే అవకాశాలు తక్కువని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
కొన్ని వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లో ఉండే రోగ నిరోధక శక్తిని సులభంగా పెంచుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం టీ, కాఫీలకు బదులుగా నీళ్లలో మిరియాలు, తులసి, పసుపు, బెల్లం, అల్లం, దాల్చిన చెక్క కలిపి వేడి చేసి వడబోసుకుని తీసుకోవాలి. ఈ నీటిని తాగడం ద్వారా జలుబు, దగ్గు, గొంతు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ యోగా, వాకింగ్ లాంటి వ్యాయామాలను కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. 
 
ఉదయం 8 గంటలలోపే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. రాగులు లేదా మినుములతో చేసిన ఇడ్లీలు తీసుకుంటే మరీ మంచిది. ప్రతిరోజూ మొలకలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు అందుతాయి. 11 గంటల సమయంలో పండ్లు విరివిగా తీసుకోవాలి. పండ్లు మన శరీరానికి కావాల్సిన విటమిన్లను పూర్తిస్థాయిలో అందజేస్తాయి. మధ్యాహ్నం యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి, సొరకాయ, పొట్లకాయ, బీరకాయ, పప్పులాంటివి తీసుకోవాలి. . 
 
ఇవి వైరస్, బ్యాక్టీరియాల నుంచి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి. మాంసాహారులు ప్రోటీన్ల కోసం చికెన్, మటన్, చేపలు, పన్నీర్ తీసుకోవచ్చు. శాఖాహారులు సోయాబీన్స్, శనగలులాంటివి తీసుకోవాలి. కాయగూరలను ఉడకబెట్టి కొంచెం మిరియాల పొడి వేసి సూప్ లా తయారు చేసుకుని తాగితే మరీ మంచిది. రాత్రి 8 గంటలలోపు భోజనం చేయాలి. పాలు తాగే అలవాటు ఉన్నవాళ్లు అందులో చిటికెడు పసుపు వేసుకుని తాగితే మరీ మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: