దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత నమోదవుతున్న కేసులు ప్రజల్లో ఆందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నా కేంద్రం అంతర్రాష్ట్ర సర్వీసులు రాష్ట్రాల మద్య అంగీకారం ఉంటే నడపవచ్చని చెప్పడంతో ఏపీ నుంచి బెంగళూరుకు బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటకలో ఆదివారం లాక్ డౌన్ అమలవుతోంది. 
 
అయితే తాజాగా ఆదివారం రోజున కడప-బెంగళూరు మధ్య నడిచే బస్సు సర్వీసులను నిలివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ నెల 12, 19, 26 తేదీలలో ఆయా రూట్లలో సర్వీసులు నిలిచిపోనున్నాయని సమాచారం అందుతోంది. ఆర్టీసీ అధికారులు ఆ సమయంలో రిజర్వేషన్ చేయించుకున్న వారికి డ‌బ్బులు తిరిగి చెల్లిస్తామని ప్రకటన చేశారు. 
 
ఇతర జిల్లాల నుంచి బెంగళూరుకు వెళ్లే బస్సులు కూడా నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. అయితే ఆదివారం మినహా మిగతా రోజుల్లో స‌ద‌రు రూటులో ఆర్టీసీ సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. మరోవైపు కరోనా విజృంభణ, లాక్ డౌన్ ఆంక్షలు, సీట్ల కుదింపు, ఇతర కారణాల వల్ల ఆర్టీసీ నష్టాల బాట పడుతోంది. ప్రస్తుతం ఆర్టీసీకి వివిధ బ్యాంకుల్లో 7 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఛార్జీలు పెంచినా ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించ్దం సాధ్యం కాదని తెలుస్తోంది. అధికారులు ఇప్పటికే ప్రయాణికులు బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. బస్సుల్లో నగదు రహిత లావాదేవీలు చేసేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు బస్టాండ్లలోని అన్ని స్టాళ్లలో మాస్కులు అందుబాటులో ఉంచుతున్నారు. మరోవైపు కరోనా పరీక్షల కోసం జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఆర్టీసీకి చెందిన ఇంద్ర బస్సులను ప్రభుత్వం సంజీవని బస్సులుగా మారుస్తోంది. ఈ బస్సుల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు 21 సంజీవ‌ని వాహ‌నాలు ఏర్పాటు చేశామని..... వీటిని ఇతర జిల్లాలకు పంపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేసుల సంఖ్య పెరగకుండా జగన్ సర్కార్ పలు ప్రాంతాల్లో నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: