తమిళనాట పరిస్థితి మరీ చేయి దాటుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ లక్షా 14 వేల 78  కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై లోనే 70 వేల కేసులున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తమినాడు తిరుచ్చి లో వెలుగు చూసిన ఓ ఘటన అందర్నీ ఆందోళన కల్గిస్తోంది. తిరుచ్చిలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్ లో ఓ  నగల దుకాణంలో పని చేసే వ్యక్తి కారణంగా ఏకంగా 104 మందికి కరోనా వైరస్ సోకినట్టు అధికార్లు నిర్ధారించడంతో అందరూ అవాక్కయ్యారు. కరోనా ఉన్నా అతడు చాలా మందిని కలిశాడు.. దాని ప్రభావం వల్లే ఇలా జరిగిందని అన్నారు.  ఇలా కొంత మంది చేస్తున్న నిర్లక్ష్యం వల్ల కరోనా కేసులు పెరిగిపోతున్నాయని అంటున్నారు.  కేసులు పెరిగిపోతున్నాయని చెప్పినా.. ఇక్కడ చాలా మంది మాస్కులు లేకుండా తిరిగేస్తున్నారు.

 

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ఎవరూ నిబంధనలు పాటించడం లేదు. దీన్ని గుర్తించిన పోలీసులు వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ఏకంగా మారియమ్మన్ దేవతను రంగంలోకి దింపారు. ఆమె చేత మాస్కులను పంపిణీ చేయిస్తూ.. వైరస్ తీవ్రత గురించి హెచ్చరికలు చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మారియమ్మన్ దేవతను పూజిస్తారు. ఏవైనా వ్యాధులు వచ్చినా.. అనారోగ్యంగా ఉన్నా నయం చేయాలంటూ ఆమెను పూజించడం ఆచారంగా వస్తోంది. 

 

దాంతో కరోనాపై ప్రజలకు అవగాహ కల్పించాలంటే.. వినూత్నంగా ఏదో ఒకటి చేస్తే కానీ అర్థం కాదని భావించారు. వెంటనే ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రధించారు. కరోనా హాట్ స్పాట్ ప్రాంతాల్లో మారియమ్మన్ అవతారంలో ఉన్న మహిళ మాస్కులు పెట్టుకోనివారి దగ్గరకు వెళ్లి పంపిణీ చేసింది. వైరస్‌ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా సూచించింది. కాగా గ్రామీణ ఏరియాల్లోని సుమారు 30 శాతం మంది ప్రజలు మాస్కులు ధరించడం లేదని ఇటీవల తేలింది. దీంతో చాలా ప్రాంతాల్లో యమ ధర్మరాజు, కరోనా వేషధారణలో కూడా ప్రజలకు అవగాహన కల్పించిన సంగతి తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: