చైనా కంటికి కనిపించే శత్రువు. ఆ దేశం నుంచి వచ్చిన కరోనా వైరస్ మాత్రం కంటికి కనబడని శత్రువు. భారత్ ఇబ్బంది ఏంటి అంటే ఒకేసారి ఇద్దరు శత్రువులతో పోరాడాల్సిరావడం. చైనాకు భారత్ లో కీలక ప్రాంతాల మీద గురి. వాటిని పట్టుకుపోయి కలిపేసుకునేంతవరకూ అలా ఒక అడుగు వెనక్కి రెండడుగులు ముందుకు వేస్తూనే ఉంటుంది.

 

అయితే చైనా ఎన్ని బాధలు పెట్టినా ఎలా చేసినా  అణగిమణగి ఉండాలా. చైనాతో యుధ్ధం చేయకూడదా. అమెరికా సాయం తీసుకోకూడదా. కూడదు అంటోంది రష్యా. రష్యా మనకు మంచి చెబుతోందో చెడ్డ చెబుతోందో తెలియదు. అసలు రష్యాతో మన సంబంధాలు ఎలా ఉన్నాయో కూడా మనకే తెలియదు. కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన చైనా రష్యాల మధ్యనే సహజ మిత్రత్వం ఉంది, ఎప్పటికీ ఉంటుంది కూడా. ఇక అమెరికా ప్రజాస్వామ్య దేశం, భారత్ కూడా అంతే. అందువల్ల సహజ బంధం ఇక్కడ పెనవేసుకోవాలి.

 

సోవియట్ యూనియన్ పతనం అయ్యాక భారత్ లో రాజకీయాలు మారి బీజేపీ ఏలుబడిలోకి వచ్చాక అమెరికాతో మన బాంధవ్యాలు గట్టిగా  బలపడుతున్నాయి. పైగా భారత్ లో ఈనాటి యువతకు అమెరికా మోజు ఎక్కువ. మన అవసరాలు, వారి అవసరాలు కూడా ఉమ్మడిగా ఉన్నాయి. ఆ విధంగా చూస్తే అమెరికా సాయం భారత్ కి అవసరం. 

 

కానీ మధ్యలో రష్యా అడ్డుతోంది. ఇక  రష్యా  చైనాతో గొడవలు వద్దు అంటోంది. గత నెలలో రష్యాలో జరిగిన ఒక కీలక సమావేశంలో ఇదే ఆ దేశ విదేశాంగ మంత్రులు కలిసారు. రష్యా, చైనా, ఇండియా విదేశాంగ మంత్రులు ఒకే చోట కూర్చుంటే రష్యా రాజీ చేసిందని వార్తలు వచ్చాయి. అయితే రష్యాకు ఈ విషయంలో ఎందుకు ఆత్రం, ఆరాటం అంటే రష్యా మనకు అతి పెద్ద ఆయుధ వ్యాపారి, మన రక్షణ సామగ్రి అంతా రష్యా సరఫరా చేస్తోంది, పైగా అమెరికాకు రష్యాకు పడదు, అమెరికాతో భారత్ దోస్తీ చేస్తే ఆ దేశం ఆయుధాలు సమకూరుస్తుంది. అపుడు రష్యా మార్కెట్ పోతుంది.

 

ఇదొక స్వార్ధం. అదే సమయంలో సహజంగా చైనా తో ఉన్న వామపక్ష బంధం కూడా రష్యాను రాయబారిగా రంగంలోకి దించుతోంది. మరి భారత్ కి లాభం ఏంటి అంటే ఏమీ లేదు, చైనాతో గిల్లి కజ్జాలు పడుతూ సైన్యాన్ని కోల్పోవడమేనా అంటే అదే అనిపిస్తోంది. ఇక అమెరికాతో పోనీ పూర్తిగా కలసి ఉందామా అంటే ఆ దేశం స్వార్ధం ఆ దేశానిది. తన వద్ద ఆయుధాలు ఇచ్చి భారత్ సొమ్ము లాగేయడమే ఆ దేశం ఆలోచన. మరి చైనా విషయం తీసుకుంటే భారత్ లోని కీలక ప్రాంతాలను కొల్లగొట్టడమే టార్గెట్. ఇపుడు భారత్ ఎవరి మాట వినాలి. ఎవరి మాట వినకూడదు అంటే భారత్ తన ప్రయోజనాలు ఏవో గుర్తెరిగి అందరితో సమాన దూరంలో ఉండడమే మంచిదని అంటున్నారు. మరి అలా చేస్తేనే తప్ప భారత్ సార్వభౌమత్వానికి విలువ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: